పొరుగు మావోయిస్టుల చొరబాటు

maoists activities in andhra chhattisgarh border - Sakshi

కొందమాల్‌ జిల్లాలో స్థావరాలు

కొత్త దళం ఏర్పాటుపై సన్నాహాలు

గిరిజన గూడాల్లో సభలు

జిల్లా ప్రజల్లో రేగుతున్న భయాందోళన

బరంపురం: అన్నంత పనే అయింది. అందరూ ఊహిస్తున్నట్లే జరిగింది. పోలీసు అధికారులు అనుమానిస్తున్నట్లుగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంతకాలంగా నిశబ్దంగా ఉన్న కొందమాల్‌ జిల్లా సరిహద్దుల్లో  ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల  మవోయిస్టులు చొరబడి వారి కార్యకలాపాలకు కారిడార్‌గా ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. సీపీఐ మవోయిస్టులకు స్థావరాలుగా ఉండే మల్కన్‌గిరి, రాయగడ, గజపతి, గంజాం, కొందమాల్‌ జిల్లాల సరిహద్దులైన ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ మవోయిస్టులు ఒడిశా రాష్ట్రంలో కార్యకలాపాలను వారి  గుప్పిట్లోకి తీసుకున్నారు.

కొద్ది రోజుల క్రితం బల్లిగుడా దట్టమైన అటవీ ప్రాంతంలో గంజాం, కొందమాల్‌ జిల్లాల  ఎస్‌ఓజీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  కూంబింగ్‌  నిర్వహిస్తున్న సమయంలో బొరముండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల  మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు గంటకు పైగా ఇరువైపులా కాల్పులు జరిగిన అనంతరం తమ ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు కామన్‌కుల్, సూన్‌పూర్‌ దట్టమైన అడవిలోకి జారుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న పలు ల్యాప్‌టాప్స్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే మావోయిస్టు శిబిరంలో స్వాధీన పర్చుకున్న లీఫ్లెట్స్‌ తెలుగులో ఉండడంతో ఆంధ్ర మావోయిస్టులు కొందమాల్‌ సరిహద్దుల్లో చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విస్తృతంగా కూంబింగ్‌
కొందమాల్‌లో మావోయిస్టులు చొరబడకుండా గంజాం, గజపతి, కొందమాల్, రాయగడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా  పోలీస్‌ బలగాలు మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. కొందమాల్‌ జిల్లా నాలుగు వైపులా సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో  కూంబింగ్‌ అఫరేషన్‌ చేపడుతున్నాయి. కొంతకాలంగా నిశ్శబ్దంగా  ఉన్న  కొందమాల్‌ సరిహద్దులు ఆంధ్ర మావోయిస్టుల చొరబాట్లతో అలజడి సృష్టిస్తున్నాయి.

భయాందోళనలో గిరిజనులు
కొద్ది రోజుల క్రితం సాలిమా జంగిల్, కామన్‌కుల్, బొరముండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులతో  గిరిజన గూడాల్లో భయాందోళనలు రేగుతున్నాయి. మావోయిస్టు నేత  సవ్యసాచి అరెస్ట్‌ తరువాత సీపీఐ మావోయిస్టు నాయకుడు మేడారం బాలకృష్ణ అలియాస్‌ నికిల్‌ సారథ్యం వహించి గంజాం, గజపతి, రాయగడ జిల్లాలను తమ కారిడార్‌గా చేసుకుని దళాన్ని  పట్టిష్టపరిచినట్లు తెలుస్తోంది.  మావోయిస్టుల కార్యకలాపాలు విస్తరించేందుకు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టులు రాయగడ అటవీ సరిహద్దుల్లో  చొరబడి శిబిరాలు నిర్వాహిస్తున్నట్లు పోలీసులు సేకరించిన అధారాలు తెలియజేస్తున్నాయి. మేడారం బాలకృష్ణ నాయకత్వంలో రాయగడ, గజపతి, గంజాం, కొందమాల్‌ జిల్లాల సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, పార్టీని విస్తృత పరిచి, ఉనికిని చాటుకునేందుకు హింసాత్మక దాడులకు సిద్ధమవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో కొత్త సవాల్‌
ఇప్పటికే   రాష్ట్రంలోని కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్‌ జిల్లాలో మావోయిస్టులు విస్తారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.  మావోయిస్టులు పాల్పడుతున్న వరుస దాడులు, కిడ్నాప్‌లు, ఇన్‌ఫార్మర్ల నెపంతో హత్యలు  పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా ప్రస్తుతం కొందమాల్‌లో ఆంధ్ర మావోయిస్టుల చొరబాటు కొత్త సవాల్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాయగడ, గజపతి, కొందమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ బృందాల సహాయంతో పోలీసులు కూంబింగ్‌  అపరేషన్‌ విస్తృతంగా చేపట్టి అటవీ ప్రాంతాల్లో జల్లెడ  పడుతున్నట్లు పోలీస్‌ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top