‘పట్టుకుంటే పదివేలు’

Madras HC orders helmets to be compulsory Both Two wheelers - Sakshi

ఇక ఇద్దరికీ శిరస్త్రాణం హైకోర్టు తాజా ఆదేశాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పట్టుకుంటే పదివేలు’. ఇదేదో మంచి సినిమా టైటిల్‌లాగుందే అనుకుని తీసిపారేస్తే ‘తప్పు’లో కాలేసినట్లే. మోటార్‌ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారిద్దరూ ఇక శిరస్త్రాణం ధరించడం తప్పనిసరని మద్రాసు హైకోర్టు తాజాగా ఆదేశించింది. మీరినవారు పట్టుబడితే రూ.10వేలు జరిమానా వసూలు చేయాలని పోలీస్‌శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

మోటార్‌ సైకిళ్లలో వెళ్లేవారు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్‌ 2015లో ఆదేశించారు. ఈ ఆదేశాల్లో ట్రాఫిక్‌ పోలీసులు విజృంభించి హెల్మెట్‌ లేకుండా బైక్‌లో ప్రయాణిస్తున్న వారిని పట్టుకుని కేసులు పెట్టారు. అంతేగాక బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కోర్టులు, మొబైల్‌ కోర్టులు ద్విచక్రవాహన చోదకులతో కిటకిటలాడాయి. కోర్టులో జరిమానా చెల్లించనదే బైక్‌లు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఆ తరువాత క్రమేణా పోలీసు జోరు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ దశలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివజ్ఞానం, భవాని సుబ్బరాయన్‌ ముందు న్యాయవాది రాజేంద్రన్‌ కోర్టులో గురువారం హాజరై హెల్మెట్‌ అంశాన్ని లేవనెత్తారు.

బైక్‌లలో వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు వేసుకోవాలనే నిబంధన సక్రమంగా అమలు కావడం లేదని చెప్పారు. నిబంధనలను అమలుచేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. దీంతో న్యాయమూర్తులు గురువారం మరలా ఆదేశాలు జారీచేశారు. మోటారు ద్విచక్రవాహనాల్లో వెళ్లే ఇద్దరూ హెల్మెట్‌ ధరించాలి, కారులో ప్రయాణించేపుడు డ్రైవర్‌ సహా అందరూ సీటు బెల్టు వేసుకోవాలని ఆదేశించారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిబంధనలను పాటించాలని చెప్పారు. హెడ్‌లైట్లకు మధ్యలో నలుపు స్టిక్కర్‌ అతికించి ఉందా అని కూడా గమనించాలని సూచించారు. ఇందుకు సంబంధించి డీజీపీ ఈనెల 27వ తేదీన హైకోర్టులో ఒక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. హెల్మెట్, సీటుబెల్టు ఆదేశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరించనివారి నుంచి రూ.10వేల వరకు జరిమానా వసూలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top