
మైసూరు: పెళ్ళి అనగానే ఎంత ఎక్కువమంది అతిథులు తరలివస్తే అంత ఆడంబరంగా జరిగినట్లు లెక్క. కానీ ప్రస్తుతం కరొనా వైరస్ ప్రభావంతో పెళ్లి వేడుకలు వాయిదా పడుతున్నాయి. కొందరేమో వైరస్‌కు సవాల్ విసురుతూ మూడుముళ్లకు సై అంటున్నారు. అలా నలుగురి మధ్య నాలుగు నిమిషాల్లో పెళ్ళి పూర్తయిన వైనం ఆదివారం మైసూరులో చోటు చేసుకుంది.
నగరంలోని గోకులంలో ఉన్న గణపతి దేవాలయంలో సివిల్ ఇంజనీర్ అయిన సోనియా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిన పరశురామ్‌కు కరోనా గొడవకు ముందే పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 17వ తేదీన ముహూర్తం. కరోనా సమస్య వల్ల ఇక ఆలస్యం కాకూడదని ఆదివారమే ఆలయంలో ఇరువురి తల్లిదండ్రుల మధ్య మాంగల్యం తంతునానేనా అనిపించారు. పెళ్లి కళ లేకపోవడంతో కొత్త జంటలో నిరుత్సాహం తాండవించింది.