రాజధాని నగరంలో రక్తం గడ్డకట్టేలా చలిపులి పంజా విసురుతుండడంతో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో రక్తం గడ్డకట్టేలా చలిపులి పంజా విసురుతుండడంతో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికారులను ఆదేశించారు. నిరాశ్రయుల కోసం ఫ్లైఓవర్ల కింద టెంట్లు వేయాలని ఆదేశించిన ఎల్జీ, నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ఢిల్లీ మెట్రోను కోరారు. గత రెండు రోజుల్లో ఎల్జీ నగరంలోని అనేక నైట్ షెల్టర్లను సందర్శించారు. నగరంలోని నిరాశ్రయులందరికీ నీడ, పడక సదుపాయం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ఢల్లీ పట్టణ ఆశ్రయ అభివృద్ధి బోర్డు (డీయూఎస్‌ఐబీ)కి టెంట్లు సమకూర్చుకునేందుకు అదనంగా మరో రూ.7 కోట్లను జంగ్ కేటాయించారని ఎల్జీ అధికార నివాసమైన రాజ్‌నివాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు డీయూఎస్‌ఐబీకి రూ.5 కోట్లు కేటాయించారు. ప్రజలను సురక్షితంగా, వెచ్చగా ఉండే నైట్ షెల్టర్లకు తరలించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలామంది నిరాశ్రయులు రోడ్లను, ఫ్లైఓవర్లను విడిచిపెట్టడం లేదని అధికారులు చెప్పారు. ఇలా మొండిగా వ్యవహరిస్తున్న వారి కోసం ఎల్జీ ఫ్లైఓవర్ల కిందనే టెంట్లు వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ ఏర్పాట్లు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉంటాయని అన్నారు.