
కృష్ణప్ప స్మారక నిర్మాణానికి సహకారం
దళిత నాయకుడు, దివంగత బి.కృష్ణప్ప స్మారక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు అందించి పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బళ్లారి(దావణగెరె): దళిత నాయకుడు, దివంగత బి.కృష్ణప్ప స్మారక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు అందించి పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లాలోని హరిహర తాలూకా హనగవాడి గ్రామం వద్ద జిల్లా యంత్రాంగం, ప్రొఫెసర్ బి.కృష్ణప్ప ట్రస్ట్, సాంఘిక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ బి.కృష్ణప్ప సాంస్కృతిక భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ప్రొఫెసర్ బి.కృష్ణప్ప సమాధి స్థలాన్ని ప్రత్యేక స్మారకంగా చేయాలనేది ట్రస్ట్ ఉద్దేశమని, దీనికి ప్రభుత్వం నుంచి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బి.కృష్ణప్ప అనితర పోరాట యోధుడని, దేశాభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అధికారం కోసం ఆశ పడలేదని, ఆయన చిన్నతనం నుంచే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో సమగ్ర మార్పును తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో నెలకొన్న దౌర్జన్యాలను, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జీఎం సిద్ధేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొంటున్న వివక్ష పూరిత ఘటనలను ఖండిస్తూ దళితుల హక్కుల కోసం గళమెత్తి బి.కృష్ణప్ప పోరాటం చేపట్టారన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న అవధిలో భవన నిర్మాణానికి కోటి రూపాయలు సమర్పించారన్నారు. అంతేకాకుండా సాంస్కృతిక భవన నిర్మాణం ఆలస్యం చేయకుండా అతి త్వరలో ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శామనూరు శివశంకరప్ప, ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్‌సీ మహాదేవ ప్రసాద్, చిత్రదుర్గం లోక్‌సభ సభ్యుడు బీఎన్ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.