రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. నగరంలో భానుడి ఆగమనం కోసం ఎదురు చూసే ప్రజలు వరుణ దేవుని అట్టహాసాన్ని తిలకించాల్సి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. నగరంలో భానుడి ఆగమనం కోసం ఎదురు చూసే ప్రజలు వరుణ దేవుని అట్టహాసాన్ని తిలకించాల్సి వచ్చింది. ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన వాన సుమారు గంట సేపు ఏకధాటిగా కురిసింది. కోరమంగల, హొసూరు రోడ్డు, సర్జాపుర, జేపీ నగర, యశవంతపుర, రాజాజీ నగర, బసవేశ్వర నగర, పీణ్యాల్లో కుంభవృష్టి కురిసింది. చూస్తుండగానే రోడ్డన్నీ వంకల్లా మారాయి.
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి. నాగరబావి, చంద్రా లేఔట్, విజయ నగర, చామరాజపేట, కేఆర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మొత్తమ్మీద 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల్లో వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోలారు, చామరాజ నగర, బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కోలారులో 70 మి.మీ. వర్షపాతం నమోదైంది. వారం రోజులుగా తెరపినిచ్చిన వానలు ఉదయం పూట హఠాత్తుగా
కురవడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో ఉదయం ఆఫీసులకు వెళ్లాల్సిన వారు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులో చిన్న పాటి వర్షానికే ట్రాఫిక్ స్తంభించిపోవడం కద్దు. కాగా స్థానికంగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వర్షాలు పడ్డాయని, అల్ప పీడనం కారణం కాదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.