యువరాజ్‌పై కాల్పులకు ఆదేశం

యువరాజ్‌పై కాల్పులకు ఆదేశం - Sakshi


 పీటీవారెంట్ జారీచేసిన నామక్కల్ కోర్టు

 మారణాయుధాల రక్షణ

 కవచంలో యువరాజ్

 వేడిరాజుకున్న ఇంజినీర్ హత్య కేసు


 

 ఇంజినీర్ గోకుల్‌రాజ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న యువరాజ్‌పై కాల్పులు

 జరిపయినా అరెస్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


 

  చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీర్ గోకుల్‌రాజ్ జూన్ 23వ తేదీన హత్యకు గురయ్యాడు. తిరుచెంగోడు సమీపంలో రైల్వేపట్టాలపై గొంతుకోసి హతమార్చిన స్థితిలో శవమై పడిఉండగా కనుగొన్నారు. గోకుల్‌రాజ్‌ను క్రూరమైన రీతిలో హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ముద్దాయి యవరాజ్ పోలీసులకు చిక్కకుండా మూడు నెలలకుపైగా అజ్ఞాతంలో ఉన్నాడు. యువరాజ్‌ను అరెస్ట్‌ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోకుల్‌రాజ్ హత్యకేసు విచారణ బాధ్యతలు స్వీకరించిన నామక్కల్ జిల్లా తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ (27) గత నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనాలకు దారితీసింది.

 

 డీఎస్పీ విష్ణుప్రియ హత్యకేసు విచారణలో ఉన్న పోలీసుల చర్యలను ఖండిస్తూ యువరాజ్ తరచూ వాట్సప్ ద్వారా ఆడియో మెసేజ్‌లు పంపేవాడు. ఒక హత్యకేసు, మరో ఆత్మహత్యకేసు వెనుక యువరాజ్ పాత్రపై పోలీసులకున్న అనుమానాలు బలపడ్డాయి. యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుశాఖ సీబీసీఐడీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అలాగే నామక్కల్ మొదటి మేజిస్ట్రేటు నేరవిభాగ కోర్టు న్యాయమూర్తి మలర్మతి యువరాజ్‌ను అరెస్ట్ చేయాలని సోమవారం పీటీ వారంట్ జారీచేశారు. పీటీ వారంట్ జారీ అయినందున యువరాజ్ తప్పనిసరిగా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే పరారీలో ఉన్న నిందితుడిగా అతనిపై అధికారిక ముద్రపడుతుంది. అంతేగాక అతని ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్‌చేస్తారు. కోవై సమీపంలోని ఒక గ్రామంలో యువరాజ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.

 

 యువరాజ్ తన ఉనికి బాహ్యప్రపంచానికి తెలియకుండా తన అనుచరులతో నిఘా పెంచినట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం యువరాజ్‌కు చెందిన అన్ని సమాచార సాధనాలను కట్‌ చేసినట్లు సమాచారం. సోమ లేదా మంగళవారాల్లో యువరాజ్ అరెస్ట్ ఖాయం అంటున్నారు. యువరాజ్ తన వద్ద భయంకరమైన మారణాయుధాలను రక్షణగా ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అవసరమైతే యువరాజ్‌పై కాల్పులు జరిపైనా ప్రాణాలతో పట్టుకుని అరెస్ట్ చేయాలని సోమవారం అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలపై ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ, పోలీస్‌శాఖ దృష్టిలో గోకుల్‌రాజ్ హత్యకేసులో యువరాజ్ ప్రధాన నిందితుడని అన్నారు.

 

 తనను అరెస్ట్ చేయకుండా బిహార్ తుపాకీ, మరికొన్ని మారణాయుధాలతో అజ్ఞాతంలో గడుపుతున్నట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అంతేగాక ఉత్తరాదిలో పలు హత్యకేసుల్లో నిందితులైన కిరాయి హంతకులతో యువరాజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలిందని అన్నారు. అరెస్ట్‌కు ప్రయత్నిస్తే యువరాజ్ తమపై మారణాయుధాలతో దాడులుచేసే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు తమకు సైతం కాల్పులు జరిపే అధికారాలు ఇచ్చారని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కోవైలో యువరాజ్‌కు ఆశ్రయం ఇచ్చిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top