ప్రేమైక జీవితం | Sakshi
Sakshi News home page

ప్రేమైక జీవితం

Published Mon, Jul 23 2018 9:01 AM

Elderly Women Care About Street Dogs In Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:‘కల్ల కండాల్‌ నాయి కాణుం..నాయి కండాల్‌ కల్ల కాణుం’ (రాయి ఉన్నపుడు కుక్క కనపడదు.. కుక్క కనపడినపుడు రాయి ఉండదు). వీధి కుక్కుల విషయంలో విసిగి పోయిన తమిళనాడు ప్రజల నోళ్లలో బహుళ ప్రాచుర్యం పొందిన నానుడు ఇది. కుక్క కనిపిస్తే రాయితో కొట్టి తరిమేయడమే అందరికీ తెలుసు. కానీ ఆ వృద్ధురాలికి వాటిని చేరదీయడం మాత్రమే తెలుసు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న వృద్ధురాలి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

కన్యాకుమారి జిల్లా కులశేఖరం కావలస్థలం ప్రాంతానికి చెందిన అయీషాబీవీ (77) భర్త పీర్‌ మహ్మమద్‌ అదే పట్టణ పంచాయతీలో కౌన్సిలర్‌గా పనిచేశాడు. రిటైర్డు ఉపాధ్యాయుడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్త కొంత కాలం క్రితం చనిపోగా, పిల్లలకు పెళ్లిళ్లయి వేరుగా ఉంటున్నారు. సహజంగా జాలి, దయ మెండుగా కలిగి ఉన్న అయిషా కొన్నేళ్ల క్రితం రెండు వీధి కుక్కలను చేరదీసి తనకున్న దాంట్లో కొద్దిగా పెట్టడం ప్రారంభించింది. ఈ రెండు కుక్కలను చూసి క్రమేణా మరిన్ని కుక్కలు రావడం ప్రారంభించాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 27కు చేరింది. పిల్లలు ఇచ్చే కూసింత డబ్బులు, భర్త పింఛను తప్ప మరే ఆసరాలేని అయిషా కుక్కలకు ఆహారం విషయంలోమాత్రం రాజీపడదు.  కుక్కలు ఊరంతా తిరిగి ఏ రాత్రికి ఇంటికి చేరుకున్నా రకరకాల తిండి, మాంసం, బిస్కెట్లు పెడుతుంది. దీంతో 24 గంటలు ఆమె ఇంటి ముందు కుక్కల సందడే సందడి.

అయిషా కుక్కలపై చూపుతున్న ప్రేమవాత్సల్యాలు మాకు ఇబ్బందిగా మారిందని ఇరుగూ పొరుగూ వారూ వ్యాఖ్యానాలు చేసేవారు. అడ్డుకునేవారు. అయితే వృద్ధురాలు మాత్రం ఇవేమీ పట్టించుకునేది కాదు. పట్టణ పంచాయతీవారు కుక్కలను పట్టుకుని చంపేస్తుంటే  కేందమంత్రి మేనకాగాంధీకి ఉత్తరం రాయగా అధికారులు వెంటనే నిలిపివేశారు. ఈ వయసులో నీకెందుకు ఈ అవస్థలు అని పిల్లలు ఎన్ని చెప్పినా వినలేదు. ఇటీవల ఆమెకు బలమైన గాయం తగలడంతో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో పిల్లలు మరోసారి ఒత్తిడి చేయడంతో విధిలేక అంగీకరించింది. అయితే బిడ్డల్లా చూసుకుంటున్న కుక్కల మాటేమిటని ఆమె కలత చెందింది. మరోసారి మేనకాగాంధీకి, జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాశారు. పీపుల్స్‌బార్‌ యానిమల్‌ సంఘం నిర్యాహకుడు ఆజాద్‌ సైతం వృద్ధురాలి వినతిని వివరిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాలకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ కన్యాకుమారి జిల్లా మూగ ప్రాణుల వధ నిరోధక సంఘం కార్యదర్శి కృష్ణమణికి తెలిపారు. కుమారకోయిల్‌ సమీపంలోని జంతుశరణాలయానికి వృద్ధురాలి ఆధీనంలోని 27 కుక్కలను రెండురోజుల క్రితం తరలించారు.

కన్నీళ్ల పర్యంతమైన వృద్ధురాలు
శరణాలయ సిబ్బంది కుక్కలను తీసుకెళుతుండగా వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఇక వాటిని చూడలేను, ఆహారం పెట్టలేనన్న ఆవేదనతో చివరిసారిగా పరోటా, మాంసం, బిస్కెట్లు పెట్టింది. ఆ మూగజీవాలు సైతం పెద్దగా అరుస్తూ వృద్ధురాలిని చూస్తూ మూగంగా రోదించడం ప్రారంభించాయి. వదలివెళ్లమంటూ మొండికేయడంతో గొలుసులతో కట్టి తరలించేందుకు శరణాలయ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది.

Advertisement
Advertisement