సోషల్ మీడియాలో బీజేపీ హల్‌చల్ | BJP vs AAP: Taking the battle to the social media ahead of Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో బీజేపీ హల్‌చల్

Dec 27 2014 11:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

రాజధానిలో రానున్న అసెంబ్లీ ఎన్నిక కోసం ‘సాంకేతిక’ ప్రచారం ఊపందుకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-ఆమ్‌ఆద్మీపార్టీలు

న్యూఢిల్లీ : రాజధానిలో రానున్న అసెంబ్లీ ఎన్నిక కోసం ‘సాంకేతిక’  ప్రచారం ఊపందుకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-ఆమ్‌ఆద్మీపార్టీలు ఈ సారి సరికొత్త ప్రచార యుద్ధానికి తెరలేపాయి. లాప్‌టాప్స్, కంప్యూటర్స్, ఐటీ నిపుణులతో కూడిన బృందాలు పోటాపోటీగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆయా పార్టీల కార్యాలయాలు సాంకేతిక ప్రచార యుద్ధానికి వేదికలుగా మారాయి.
 
 హామీల వర్షం: నగరంలోని  14, పండిట్ పంత్ మార్గంలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో గతనెల ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఐటీ నిపుణులను పార్ట్‌టైంలో పనిచేస్తూ బీజేపీ ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి నిరంతరం కుస్తీపడుతున్నారు. రాజకీయ విశ్షేషణలు, నాయకుల ప్రకటనలను ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీ వైఫల్యాలను‘ఫేస్‌బుక్’తోపాటు ‘ట్విట్’లో ఎండగడుతున్నారు. బీజేపీ ఐటీ సెల్ అధినేత సుమీత్ బాసిన్ నాయకత్వంలో ‘వార్‌రూమ్’ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూనే, ప్రతిపక్షాలైన ఆప్, కాంగ్రెస్ పార్టీల వల్ల గతంలో జరిగిన నష్టాన్ని, వైఫల్యాలను ప్రజలకు వివ రిస్తూనే, ఆయా సమస్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో ఆయా సమస్యలకు ప్రాధాన్యం కల్పిస్తామని ‘వార్‌సెల్’ సెల్ హామీ ఇస్తోంది.
 
 సత్ఫలితాలు సాధిస్తాం : బాసిన్
 అగ్రనాయకుల సూచనల మేరకు..సోషల్ మీడియాపై తమ పార్టీ ఆదిపత్యం కొనసాగించేందుకు పార్టీ సాంకేతిక నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ‘ వార్‌రూమ్స్ ప్రతిఎన్నికల ముందు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుకుసాగుదాం. ఫలితాలు సాధిస్తాం’ అని బాసిన్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం పార్టీకి కొత్తేమీ కాదు, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసి సత్ఫలితాలు సాధించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో నాలుగు నెలల్లోనే 11 నుంచి 13 లక్షల మంది ఫేస్‌బుక్‌లో పార్టీ పేజీల ద్వారా మద్దతు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం పార్టీ పోస్టులు ఆమ్‌ఆద్మీ పార్టీ పోస్టులకన్నా రెట్టింపు ఇష్టపడుతున్నారని, బీజేపీ సమాచారాన్ని 10,000ల మంది ఇష్టపడుతుండగా. ఆమ్‌ఆద్మీ సమాచారాన్ని కేవలం 5,000 మంది మాత్రమే ఇష్టపడుతున్నారని, పార్టీ ఆధిక్యతకు ఇది నిదర్శనమని అన్నారు.
 
 రంగంలోకి వాలంటీర్లు: ఈ ప్రచారంలో ఫేస్‌బుక్, ట్విట్‌లతో పాటు స్కౌట్స్, వాలంటీర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రచారంలో సుమారు 100 మంది వాలంటీర్లు 52 నుంచి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి 500 మంది వాలంటీర్లు రంగంలోకి దిగారు.  వీరంతా పార్టీ వైఖరిని సాధారణ ప్రజలకు వివరించడంతోపాటు వారి అభిప్రాయాలను స్వీకరించి పార్టీ నాయకత్వానికి తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. వార్ రూమ్ ఫేస్‌బుక్, ట్విట్, వాట్స్‌ఆప్, ఈమేయిల్స్, ఎస్‌ఎంఎస్‌లపై దృష్టి సారించింది. ట్విట్టర్ ప్రచారాన్ని వచ్చేనెలలో ఉధృతం చేస్తామని, వాట్స్‌ఆప్ ద్వారా పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ప్రారంభించడానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ఇప్పటికే వాట్స్‌ఆప్‌ను వినియోగిస్తోంది. దీని ద్వారా 15,000ల మంది పార్టీ నాయకులు, 250 గ్రూపులుగా అధినాయకత్వంతో పరస్పరం ఎన్నికల్లో విజయం సాధించడానికి కసరత్తుచేస్తున్నారు.
 
 బీజేవైఎం ఆధ్వర్యంలో  మహిళా సభ్యత్వాల నమోదు
 న్యూఢిల్లీ : మహిళలు రాజకీయాల్లో రాణించాలని భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు.  దేశవ్యాప్తంగా మహిళా సభ్యత్వాలపై బీజేపీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా  శనివారం నగరంలోని పాలికా బజార్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలువురు మహిళలకు సభ్యత్వం అందజేశారు. డిసెంబర్ 30వ తేదీ వరకు సభ్యత్వం నమోదు కొనసాగుతోందని ఆయన అన్నారు. మహిళలు పార్టీలో అధిక సంఖ్యంలో చేరుతున్నారని ఆయన అన్నారు. దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఎదగాలని అన్నారు. బీజేవైఎం 2 కోట్ల సభ్యులను చేర్పించాలని పార్టీ టార్గెట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే నాలుగురోజులుగా మహిళల సభ్యత్వ నమోదు చేస్తున్నామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement