విద్యాసంస్థల్లో మొబైల్ ఫోన్లు నిషేధించాలి | Because of educational mobile phones | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల్లో మొబైల్ ఫోన్లు నిషేధించాలి

Jul 12 2014 2:49 AM | Updated on Jul 28 2018 8:51 PM

విద్యాసంస్థల్లో మొబైల్ ఫోన్లు నిషేధించాలి - Sakshi

విద్యాసంస్థల్లో మొబైల్ ఫోన్లు నిషేధించాలి

రాష్ర్టంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు మొబైల్ ఫోన్లను తీసుకు రావడాన్ని పూర్తిగా నిషేధించాలని...

  • ప్రభుత్వానికి రాష్ర్ట ఉభయ సభల మహిళాశిశు సంక్షేమ కమిటీ సిఫార్సు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో లైంగిక వేధింపులు, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు మొబైల్ ఫోన్లను తీసుకు రావడాన్ని పూర్తిగా నిషేధించాలని ఉభయ సభల మహిళాశిశు సంక్షేమ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తక్షణమే విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి  సూచించింది. కమిటీ అధ్యక్షురాలు శకుంతలా శెట్టి శుక్రవారం శాసన సభలో నివేదికను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లను 30 నుంచి 33 శాతానికి పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.

    సంతాన భాగ్యం లేని మహిళలకు మాతృత్వం కోసం కృత్రిమ గర్భాల (సరోగసి) ప్రచారం ద్వారా వ్యాపార దందాలను నిర్వహిస్తున్న ‘సేవా కేంద్రాల’ను అదుపు చేసే క్రమంలో భాగంగా ‘అద్దె అమ్మ’లకు రక్షణ ఇవ్వడానికి అనేక సిఫార్సులను చేసింది. సరోగసిపై భారతీయ వైద్య విద్యా పరిషత్ రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించింది. దీనిపై చట్టాన్ని రూపొందించేంత వరకు ఈ వ్యవహారాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సేవా కేంద్రాలను  నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కమిటీ చేసిన ఇతర సిఫార్సులు...
     
    నకిలీ వైద్యులను నివారించడానికి...లెసైన్స్‌దారు పేరు, వివరాలతో దుకాణం ముందు విధిగా బోర్డును వేలాడదీయాలన్న అబ్కారీ శాఖ ఆదేశాల మాదిరి ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు...ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్ నంబరు సహా వివరాలతో బోర్డులు పెట్టాలి.
     
    ప్రస్తుత మహిళా రిజర్వేషన్ల విధానం ప్రకారం ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిన సమయంలో అర్హులైన మహిళలు లభ్యం కానట్లయితే అదే వర్గానికి చెందిన పురుషులను నియమిస్తున్నారు. అలా కాకుండా మూడు సార్లు ప్రకటనలు ఇచ్చినా, ఫలితం లేకపోతేనే అదే వర్గానికి చెందిన పురుషులను నియమించాలి.
     
    జీవన వ్యయం బాగా పెరిగిపోయినందున కళాకారులకు పింఛన్‌ను ప్రస్తుతం ఇస్తున్న రూ.వెయ్యి నుంచి రూ.4 వేలకు పెంచాలి. ఈ పింఛన్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ రంగంలో కనీసం 20 ఏళ్లు సేవలందించి ఉండాలనే నిబంధన విధించే విషయమై యోచించాలి.
     
    ప్రతి పోలీసు స్టేషన్‌లో 20 శాతం మహిళా సిబ్బందిని నియమించాలి. ప్రత్యేక మహిళా పోలీసు స్టేషన్లను ఎక్కువ సంఖ్యలో ప్రారంభించాలి. ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా సిబ్బందితో పాటు పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళల కోసం ప్రత్యేక మరుగు దొడ్ల సదుపాయాన్ని కల్పించాలి.
     
    పోలీసు స్టేషన్లలో పనులు పారదర్శకంగా ఉండడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
     
    కర్మాగారాల్లో లాభాపేక్ష లేని క్యాంటీన్లను నిర్వహించేలా కార్మిక శాఖ యాజమాన్యాలను ఆదేశించాలి. కార్మికులకు సబ్సిడీ ధరపై నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement