అద్దె రూ.1.. హంగులకు రూ.10 కోట్లు!
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న దుబారా ఖర్చుల జాబితాలో మరో అంశం వెలుగులోకి వచ్చింది.
అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న దుబారా ఖర్చుల జాబితాలో తాజాగా మరో భారీ కేటాయింపు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే భవనాల ఆధునీకరణ పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న బాబు సర్కార్ పరిశ్రమల కార్యాలయానికి అద్దెకు నెలకు ఒక్క రూపాయిగా నిర్ణయించడంతో పాటు వాటి హంగులకు రూ.10 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కాంట్రాక్టును ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని విజయవాడలోని ముత్యాలంపాడుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన ఓ అంతస్తును పరిశ్రమలశాఖకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 10 వేల చదరపు అడుగులు ఉండే ఈ భవనానికి నామమాత్రపు (నెలకు ఒక్క రూపాయి) అద్దె చెల్లిస్తారు. ఈ భవనాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించింది.
భవన అంతస్తు ఆధునీకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చించాలని ప్రతిపాదించింది. ఇంత పెద్ద మొత్తం నిధులు వెచ్చిస్తున్న పరిశ్రమల శాఖ పనులన్నీ ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లకే అప్పజెప్పేందుకు సిద్ధమైంది. మార్చిలోగా ఇది పూర్తి చేయాల్సి ఉన్నందున కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


