కివీస్‌ను పాక్‌ ఆపేనా?

World Cup 2019: pakistan vs New Zealand - Sakshi

నేడు రెండు జట్ల మధ్య మ్యాచ్‌

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తూ సెమీఫైనల్స్‌ మెట్టెక్కేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది న్యూజిలాండ్‌. మరోవైపు నాకౌట్‌ చేరాలంటే ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌ది. ఈ నేపథ్యంలో రెండు జట్లూ బుధవారం తలపడనున్నాయి. టోర్నీలో క్లిష్టమైన సందర్భాల్లో పట్టు వదలకుండా పోరాడుతున్న కివీస్‌ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పాక్‌ మాత్రం ఆపసోపాలు పడుతోంది.

అయితే, ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్‌ హారిస్‌ సొహైల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన విజయం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ సమయంలో పాక్‌ తెగించి ఆడేందుకు ప్రయత్నించనుంది. ప్రధాన పేసర్‌ ఆమిర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రెండో పేసర్‌ వహాబ్‌ రియాజ్‌ మెరిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఓపెనర్లు ఇమాముల్, ఫఖర్‌ జమాన్, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌కు తోడుగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ పరుగులు చేస్తే బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది.

న్యూజిలాండ్‌కు అంతా బాగున్నా, ఓపెనర్లు గప్టిల్, మున్రో ఫామ్‌ కలవర పరుస్తోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ చెలరేగి ఆడుతుండటం, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ నిలకడ కారణంగా లాథమ్‌ సహా మిగతావారి వైఫల్యం ప్రభా వం చూపడం లేదు. ఆల్‌ రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్‌ జట్టుకు కావాల్సిన విధంగా రాణిస్తున్నారు. పేసర్లు బౌల్ట్, ఫెర్గూసన్‌ పదునైన బంతులను పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలా కాచుకుంటారో చూడాలి.

ముఖాముఖి రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు జరగ్గా 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ నెగ్గింది. కివీస్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మెగా ఈవెంట్‌లలో మొత్తం 8 మ్యాచ్‌లాడగా... ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్‌ గెలుపొందాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top