
విండీస్‌పై భారత్ అతి భారీ విజయం సిరీస్ సాగనున్న తీరుపై అభిమానులను ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేసి ఉంటుంది. అయితే, కరీబియన్ జట్టు పుంజుకోగలదు. గతేడాది ఇంగ్లండ్‌లో ఇదే పరిస్థితుల్లో వారు టెస్టు నెగ్గారు. ఆ మ్యాచ్‌లో షై హోప్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బ్రాత్‌వైట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఇద్దరు రాణిస్తే రాజ్‌కోట్‌లో కంటే విండీస్ ఎక్కువ పరుగులు చేయగలదు. తొలి టెస్టులో భారత స్పిన్నర్లను ఎదుర్కొనడంలో సరైన దృక్పథం లేకపోవడమే పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌కు ప్రతిబంధకంగా మారింది. బంతి విపరీతంగా తిరిగితే వారి ప్రదర్శనను అర్ధం చేసుకోవచ్చు. కానీ, పరిస్థితి అలా లేదు.
వ్యూహాత్మకంగా ఆడాల్సింది పోయి క్రీజులో నిలవలేం అన్నట్లు తొందరపడ్డారు. 649 పరుగుల భారీ స్కోరు దన్నుతో... భారత స్పిన్నర్లకు ఒకటీ రెండు ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చినా బాధపడాల్సిన అవసరం లేకపోయింది. వారు వరుసపెట్టి వికెట్లు తీయడం భారత కెప్టెన్‌ను సంతోషపర్చి ఉంటుంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ టెస్టులో తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బౌన్సర్లు సంధించడంపై అంతగా ఉత్సుకత చూపకపోవడం కూడా మ్యాచ్‌లో విండీస్ పోటీ ఇవ్వకపోవడానికి మరో కారణం. విపరీతమైన వేడిని కారణంగా చెప్పుకొన్నా, ఒక వేగవంతమైన బౌలర్ తన ప్రధాన ఆయుధాన్ని ఉపయోగించుకోకుంటే పటిష్ఠ భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడానికి ఇక మార్గం ఏముంటుంది? స్వింగ్, సీమ్ రెండూ లేని రాజ్‌కోట్ పిచ్‌పై బౌలర్లు బౌన్సర్లు వేసి ఉంటే విండీస్ తిరిగి పోటీలోకి రాగలిగేది. వారు కనుక ఈ పరాజయంపై నిజాయతీగా సమీక్ష చేసుకుంటే రెండో టెస్టులో పోటీని ఇచ్చే ప్రదర్శన చేయగలరు. లేదంటే మరో పరాజయం తప్పకపోవచ్చు.