ఆట అదుపు... మాట పొదుపు | Virat Kohli hopes for quiet tour of Australia | Sakshi
Sakshi News home page

ఆట అదుపు... మాట పొదుపు

Nov 16 2018 1:27 AM | Updated on Nov 16 2018 8:33 AM

 Virat Kohli hopes for quiet tour of Australia - Sakshi

ముంబై: కఠిన పరిస్థితుల్లో మన బ్యాట్స్‌మెన్‌ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాంటి స్థితిలో మరెక్కడి నుంచో పరిష్కారం లభిస్తుందని ఆశించకుండా తామే ఆటను అదుపులోకి తెచ్చుకోవాలని అతను అన్నాడు. సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా బయల్దేరుతున్న నేపథ్యంలో గురువారం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత తమ ఆటతీరుపై జరిపిన సమీక్ష, రాబోయే సిరీస్‌ సన్నద్ధతపై అతను తన ఆలోచనలు వెల్లడించాడు. కోచ్‌ రవిశాస్త్రి తీరు గురించి, స్లెడ్జింగ్, పేసర్ల ప్రదర్శన, జట్టు పరిస్థితి తదితర అంశాలపై సూటిగా జవాబులిచ్చాడు. కోహ్లి ఏమన్నాడో అతడి మాటల్లోనే... 

ఆయన ‘ఎస్‌ మ్యాన్‌’ కాదు... 
నేనేం చెప్పినా రవిశాస్త్రి సరే అంటాడని, ఆయన కేవలం ‘ఎస్‌ మ్యాన్‌’ అని విమర్శిస్తున్నారు. భారత క్రికెట్‌లో నేను విన్న అతి వింత పదం ఇది. రవి భాయ్‌ చెప్పినన్ని సార్లు నాకెవరూ ‘నో’ చెప్పలేదు. నిజాయతీతో కూడిన అభిప్రాయం కోసం నేను సంప్రదించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. తన సూచనలతో నా ఆటలో చాలా మార్పులు చేసుకున్నా. ప్రస్తుత జట్టు నిర్మాణంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఇవి బయటకు వెల్లడించాల్సిన అవసరం లేని జట్టు అంతర్గత అంశాలు. మా మనసులు పరిశుద్ధం. మా దృక్పథం సరైనది. అయినా ప్రజలకు సొంత అభిప్రాయం వెల్లడించే హక్కుంది. వాటిపై మేం తీర్పు ఇవ్వలేం. 




జట్టు గురించి... 
మెరుగవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేనిపై దృష్టి పెట్టాలో జట్టుగా మాకు తెలుసు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకునేందుకు సిద్ధం కావాలి. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత తప్పులను సమీక్షించుకున్నాం. కఠినమైన పరిస్థితులకు ఎదురీది మ్యాచ్‌ను అదుపులోకి తీసుకోవడం ఎలా అనేదానిపై ఆలోచించాలి. 

బౌలర్ల ఫిట్‌నెస్‌పై... 
గత ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే ఈసారి మా బౌలర్ల ఫిట్‌నెస్‌ స్థాయి పెరిగింది. పిచ్‌ నుంచి సహకారం లభించని, కూకాబుర్రా బంతి కూడా పెద్దగా ప్రభావం చూపలేని స్థితిలో కూడా రోజంతా పేస్‌లో పదును తగ్గకుండా చూసుకోవాలి. దక్షిణాఫ్రికా ఇలాగే చేసి ఇక్కడ టెస్టుల్లో గెలవగలిగింది.

  

బ్యాట్స్‌మెన్‌ బాధ్యత అది... 
ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ ఇంగ్లండ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. సమష్టి ప్రదర్శన ఉంటే ఒక్క టెస్టు కాదు... సిరీసే గెలవగలం. లోయరార్డర్‌ భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. విదేశాల్లో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్లు మనం ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఇవ్వవు. మన జట్టు అనూహ్యంగా కుప్పకూలిపోతే మళ్లీ కోలుకునే ప్రయత్నం చేయాలే తప్ప దాని గురించి ఆలోచిస్తూ మళ్లీ దెబ్బ తినకూడదు.  

స్లెడ్జింగ్‌ లేకుండా ఆడగలను...  
‘నో స్లెడ్జింగ్‌’ విధానం అవలంబించాలని ఆసీస్‌ క్రికెట్‌ భావించడం వారికి సంబంధించిన విషయం. వాగ్వాదాలు లేని ఆటకు నేను సిద్ధమే. కెరీర్‌ ప్రారంభంలో దూకుడుగా ఉన్న నేను పరిణతి సాధించాను. సొంత శక్తిసామర్థ్యాలపై నమ్మకంతో బాగా ఆడగలను. అయినా మేమెప్పుడూ ముందుగా స్లెడ్జింగ్‌కు దిగలేదు. మాది కేవలం ప్రతిస్పందనే. ఇలాంటివి లేకుంటే ఎవరి ఆట వారు ఆడుకుంటాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement