
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఐపీఎలే అజెండాగా చర్చించింది. కానీ... అచ్చూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లాగే ప్రపంచకప్‌పై ఏ నిర్ణయం తీసుకోనట్లే... లీగ్‌పై కూడా మన బోర్డు స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే బోర్డు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... దేశంలో మిలియన్ కరోనా బాధితులు (10 లక్షలు) దాటిన నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ పుట్టింట్లో జరిగే అవకాశాలైతే లేవు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే లీగ్ మెరుపులు సాధ్యమవుతాయి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో యూఏఈనే సరైన ప్రత్యామ్నాయమని బోర్డు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇక భారత జట్టు కసరత్తు కోసం మూడు వేదికల్ని పరిశీలించారు. మార్చి నుంచి అసలు మైదానంలోకి దిగని టీమిండియాకు నిర్వహించే శిబిరం కోసం దుబాయ్‌తో పాటు అహ్మదాబాద్, ధర్మశాల వేదికలపై చర్చ జరిగింది. ఒకవేళ ఐపీఎల్ గనక యూఏఈలో జరిగితే కోహ్లి సేనకు దుబాయ్‌లో శిబిరం అనివార్యమని బోర్డువర్గాలు తెలిపాయి.