సిరీస్‌ వైపు భారత్‌ చూపు

Today is  second T20 with  Australia

ఆత్మ విశ్వాసంతో కోహ్లి సేన 

ఒత్తిడిలో ఆస్ట్రేలియా

నేడు రెండో టి20  

వన్డే సిరీస్‌లో హవా కొనసాగించిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌నూ తమ ఖాతాలో వేసుకునేందుకు సన్నద్ధమైంది.  మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఆశలు ముగించాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది.  భారత బ్యాట్స్‌మెన్, బౌలర్లు అంతా ఫామ్‌లో ఉండటంతో ఇదేమంత కష్టం కూడా కాకపోవచ్చు. మరో వైపు గత మ్యాచ్‌ వైఫల్యం నుంచి కోలుకునే ప్రయత్నంలో కంగారూలు ఉన్నారు.   

గువాహటి: పర్యాటక జట్టుపై అన్నింటా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత జట్టు తాజాగా ఈ టి20 సిరీస్‌పై కూడా కన్నేసింది. చివరి మ్యాచ్‌ దాకా వెళ్లకుండా సిరీస్‌ ఫలితాన్ని ఇక్కడే రాబట్టాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ జరగనుంది. భారత్‌ ఫామ్‌ దృష్ట్యా ఇక్కడే సిరీస్‌ విజయం దక్కినా ఆశ్చర్యం లేదు. ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు అంతా జోరుమీదున్నారు. ఇక ఆసీస్‌ మాత్రం ఈ పర్యటన ఆసాంతం అగచాట్లతోనే సతమతమవుతోంది.  ఈ మ్యాచ్‌ ద్వారా భారత క్రికెట్‌ సిగలో మరో కొత్త స్టేడియం చేరనుంది. అస్సాం క్రికెట్‌ సంఘం (ఏసీఏ) కొత్తగా నిర్మించిన బర్సపర స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతోంది. టి20ల్లో ఆసీస్‌పై భారత్‌దే ఘనమైన రికార్డు. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు జరిగితే పదింట గెలిచి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమన్నదే ఎరుగదు. ఆస్ట్రేలియా చేతిలో చివరి సారిగా ఐదేళ్ల క్రితం 2012లో భారత్‌ ఓడింది. ఈ నేపథ్యంలో తమ అద్భుత రికార్డును కొనసాగించాలని కోహ్లి సేన భావిస్తోంది.  

జోరు మీదున్న భారత్‌
అసాధారణ ప్రదర్శనతో దూసుకెళ్తున్న భారత్‌ టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీశారు. బుమ్రా, భువనేశ్వర్‌ పేస్‌తో కట్టడి చేస్తుంటే... మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌ యాదవ్‌ ఇద్దరు ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు. వన్డే సిరీస్‌తో కలిపి ఈ స్పిన్‌ ద్వయమే 16 వికెట్లు పడగొట్టింది. ఐపీఎల్‌ అనుభవం ఉన్న ఆసీస్‌ ఆటగాళ్లపై కూడా వీళ్లిద్దరు ప్రభావం చూపించడం సానుకూలాంశం. ఇక బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మకు జతయిన శిఖర్‌ ధావన్‌ ఈ సిరీస్‌లో తన సత్తాచాటేందుకు ఈ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. కెప్టెన్‌ కోహ్లి సహా మిడిలార్డర్‌లో ధోని, హార్దిక్‌ పాండ్యా అంతా ఫామ్‌లో ఉండటంతో భారత్‌ భారీ స్కోరుకు ఢోకాలేదు.  

వార్నరే పెద్ద దిక్కు
ఆసీస్‌ బ్యాటింగ్‌ బలమంతా ముగ్గురిమీదే నడుస్తోంది. వార్నర్, ఫించ్, స్మిత్‌లనే కంగారూ జట్టు నమ్ముకుంది. అయితే స్మిత్‌ భుజం గాయం కారణంగా పొట్టి ఫార్మాట్‌కు  దూరమయ్యాడు. దీంతో వార్నరే జట్టును, బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ మ్యాక్స్‌వెల్‌ వన్డే సిరీస్‌లో చేసింది తక్కువే. తొలి టి20లో కూడా అతను విఫలమయ్యాడు. ఈ టూర్‌లో అతను ప్రతీసారి మణికట్టు స్పిన్నర్‌ చహల్‌ చేతికే చిక్కాడు. అతనిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో కూల్టర్‌ నీల్‌ ఒక్కడే భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాడు. వన్డే సిరీస్‌లో అతను 10 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తున్నాడు. వర్షంతో కుదించుకుపోయిన తొలి టి20లో పెద్దగా ఎవరికీ బౌలింగ్‌ చేసే అవకాశం లేకపోయింది.  

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్‌ శర్మ, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్, కుల్దీప్‌ యాదవ్, చహల్, భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా: వార్నర్‌ (కెప్టెన్‌), అరోన్‌ ఫించ్, ట్రెవిస్‌ హెడ్, మ్యాక్స్‌వెల్‌/ హెన్రిక్స్, స్టొయినిస్, క్రిస్టియాన్, టిమ్‌ పైన్, కూల్టర్‌ నీల్, జంపా/ ఆండ్రూ టై, రిచర్డ్‌సన్, బెహ్రెండార్ఫ్‌.

పిచ్‌–వాతావరణం
ఈ వేదికపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. పిచ్‌ స్వభావాన్ని అంచనా వేయలేం. ఇక ఈ మ్యాచ్‌నూ వరుణుడు వెంటాడుతున్నాడు. సోమవారం ఇక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు చినుకులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది.

1 గువాహటిలో కొత్తగా నిర్మించిన బర్సపర స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. గతంలో ఇక్కడి నెహ్రూ స్టేడియం 16 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్‌ 14 గెలవగా, 2 వర్షం కారణంగా రద్దయ్యాయి.  

38 మరో 38 పరుగులు చేస్తే విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.   

రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top