టీమిండియా కోచ్‌ ప్రకటనకు ముహూర్తం ఖరారు!

Team India Next Coach May Be Announced on 16th August - Sakshi

ముంబై : ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం అభిమానులను ఆసక్తిపరుస్తున్న మరో అంశం తదుపరి టీమిండియా కోచ్‌ ఎవరని?. ప్రస్తుత కోచింగ్‌ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించారు. అంతేకాకుండా కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ కోసం బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక చేపట్టనుంది. ఈ బృందం ఇప్పటివరకు అందిన దరఖాస్తుల నుంచి ఆరుగురిని షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ ఆరుగురిని శుక్రవారం(ఆగస్టు 16) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ చేయనుంది. అదే రోజున కోచ్‌ ఫలితాలు కూడా ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. 

టీమిండియా ప్రధాన కోచ్‌ రేసులో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు ఉన్నారు. ఈ ఆరుగురికి మాత్రమే కపిల్‌ దేవ్‌ కమిటీ ఇంటర్వ్యూలు చేయనుంది. ఇక సారథి విరాట్‌ కోహ్లి రవిశాస్త్రి వైపే మొగ్గుచూపడంతో అతడినే మళ్లీ ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. కోచ్‌, కెప్టెన్‌ ఇష్టం మేరకు మిగతా సిబ్బందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మినహా మిగతా సిబ్బంది యథాతథంగా ఉంటారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top