రైనాకు ధోని చాలా మద్దతిచ్చాడు

Suresh Raina Was MS Dhoni Favourite Player Recalls Yuvraj Singh - Sakshi

ఫామ్‌లో లేని సమయంలో పలు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ప్రతీ కెప్టెన్‌కు జట్టులో ఒక ఇష్టమైన ఆటగాడు ఉంటాడని... భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు (టి20, వన్డే ఫార్మాట్‌) అందించిన ఏకైక కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనికి ఇష్టమైన ప్లేయర్‌ సురేశ్‌ రైనా అని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సమయంలో తనతో పాటు రైనా, యూసుఫ్‌ పఠాన్‌ ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపికలో ధోని తర్జనభర్జన పడ్డాడని యువీ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘రైనాకు మాజీ సారథి ధోని అండదండలు పూర్తిగా ఉండేవి. ప్రపంచకప్‌ జట్టులో నాతోపాటు రైనా, యూసుఫ్‌ పఠాన్‌ కూడా ఎంపికయ్యారు.

తుది జట్టు ఎంపికలో ధోని సందిగ్ధంలో పడ్డాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు లేకపోవడం, బంతితోనూ నేను రాణించడంతో నన్ను తుది జట్టులో ఆడించడం అనివార్యమైంది. రైనా ఫామ్‌లో లేకున్నా ధోని అతడికి చాలా అవకాశాలు ఇచ్చాడు’ అని యువీ అన్నాడు. అయితే 2011 ప్రపంచకప్‌ విషయానికొస్తే మాత్రం గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ధోని నిర్ణయమే సరైనదనిపిస్తోంది. యువరాజ్‌ వ్యాఖ్యల్లో నిజం లేదనిపిస్తోంది. ఆ మెగా ఈవెంట్‌లో యూసుఫ్‌ పఠాన్‌కు వరుసగా ఆరు లీగ్‌ మ్యాచ్‌ల్లో ధోని అవకాశం ఇచ్చాడు.

యూసుఫ్‌ పఠాన్‌ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 74 పరుగులు చేసి, కేవలం ఒక వికెట్‌ తీసి విఫలమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో రైనా, యూసుఫ్‌ పఠాన్‌లిద్దరినీ ధోని తుది జట్టులో ఆడించాడు. యూసుఫ్‌ పఠాన్‌ ఫామ్‌లో లేకపోవడంతో నాకౌట్‌ దశ నుంచి అతని స్థానంలో రైనాకు ధోని అవకాశం ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రైనా 28 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 39 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు. ఫైనల్లో మాత్రం రైనాకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఓవరాల్‌గా రైనా ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 74 పరుగులు చేసి, ఒక వికెట్‌ తీశాడు.  

ఆ బ్యాట్‌పై సందేహపడ్డారు...
టి20 ప్రపంచకప్‌ టోర్నీలో తాను వాడిన బ్యాట్‌లో ఏదో రహస్యం ఉందని అందరూ సందేహపడ్డారని యువరాజ్‌ చెప్పాడు. 2007 టి20 వరల్డ్‌ కప్‌లో వాడిన బ్యాట్‌ తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాదిన తర్వాత ప్రతీ ఒక్కరూ తన బ్యాట్‌పై సందేహాలు వ్యక్తం చేశారని చెప్పాడు. ‘ఆసీస్‌ కోచ్‌ నా దగ్గరికి వచ్చి నీ బ్యాట్‌లో ఫైబర్‌ ఉందా? అలా ఉండటం చట్టబద్ధమేనా అని అడిగాడు. మ్యాచ్‌ రిఫరీ కూడా బ్యాట్‌ను పరిశీలించి వెళ్లాడు. మీ బ్యాట్‌ ఎవరు తయారుచేస్తారంటూ చివరకు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కూడా నన్ను అడిగాడు. ఏదేమైనా టి20, వన్డే వరల్డ్‌కప్‌లలో నేను వాడిన బ్యాట్‌లు నాకెంతో ప్రత్యేకం’ అని యువీ చెప్పాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top