73 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిన స్మిత్‌

Steve Smith Breaks 73 Year Old Record - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఏకంగా ఏడు దశాబ్దాల పాటు ఉన్న రికార్డును తిరగరాశాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఏడు వేల పరుగుల మార్కును చేరాడు. మహ్మద్‌ ముసా బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా టెస్టు ఫార్మాట్‌లో 7 వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వేగవంతంగా ఏడువేల టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 73 ఏళ్ల రికార్డును స్మిత్‌ బ్రేక్‌ చేశాడు. 1946లో ఇంగ్లండ్‌ గ్రేట్‌ వాలీ హమ్మాండ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల్ని సాధించాడు.

ఇదే ఇప్పటివరకూ తక్కువ ఇన్నింగ్స్‌లో ఏడు వేల పరుగులు సాధించిన రికార్డుగా ఉంది. కాగా, స్మిత్‌ 126వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్కును చేరడంతో హమ్మాండ్‌ రికార్డును సవరించాడు. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్‌ 134 ఇన్నింగ్స్‌ల్లో 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక సచిన్‌ టెండూల్కర్‌(136) నాల్గో స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లి, కుమార సంగక్కారా, గ్యారీ సోబర్స్‌(138)లు సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. ఇక ఆసీస్‌ తరఫున ఏడు వేల టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడి స్మిత్‌ నిలిచాడు. మరొకవైపు డాన్‌ బ్రాడ్‌మన్‌ టెస్టు పరుగుల్ని కూడా స్మిత్‌ అధిగమించాడు. బ్రాడ్‌మన్‌ తన టెస్టు కెరీర్‌లో 6,996 పరుగులు సాధించగా, దాన్ని స్మిత్‌ దాటేశాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top