
కోచ్ రేసులో నేను కూడా..
గతంలో టీమిండియా కోచ్గా చేసే తీరిక లేదని స్పష్టం చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా భవిష్యత్తులో భారత క్రికెట్ కోచ్ ఇంటర్య్వూకు హాజరు కావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.
కోల్కతా: గతంలో టీమిండియా కోచ్గా చేసే తీరిక లేదని స్పష్టం చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా భవిష్యత్తులో భారత క్రికెట్ కోచ్ ఇంటర్య్వూకు హాజరు కావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ' ఇప్పటివరకూ భారత క్రికెట్ కోచ్ పదవికి సంబంధించి ఇంటర్య్వూకు హాజరు కాలేదు. ఆ రోజు భవిష్యత్తులో వస్తుందని అనుకుంటున్నా. 20 సంవత్సరాల క్రితం దేశం తరపున తొలి మ్యాచ్ ఆడాను. ఇప్పుడు కోచ్ ను సెలక్ట్ చేసే సభ్యుల్లో ఒకడిగా ఉన్నా. 2005-06లో గ్రెగ్ చాపెల్ కోచ్ నియామకంలో పరోక్షంగా నా పాత్ర కూడా ఉంది. మరొకసారి ఆ అవకాశం వచ్చింది. నా సహచరులు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్లతో కలిసి కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను అప్పజెప్పారు. ఇవన్నీ నా జీవితంలో చోటు చేసుకోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ క్రమంలోనే నేను కూడా ఏదొక రోజు కోచ్ రేసులో ఉండవచ్చు 'అని గంగూలీ మనుసులోని మాటను బయటపెట్టాడు.
మంగళవారం భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ పదవి కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ 21 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ తీసుకోనుంది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, ఆమ్రే, వెంకటేశ్ ప్రసాద్, టామ్ మూడీ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.అయితే ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్య్యూకు హాజరుకానున్నాడు.