ప్రమాదకరమైన పిచ్‌పై ‘టెస్టు’ ఆడుతున్నాం

Sourav Ganguly Comments On Coronavirus - Sakshi

కరోనాపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విచారం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ బారిన పడి ఎందరో అసువులు బాయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందన్నాడు. ఈ సంక్షోభాన్ని ప్రమాద కరమైన పిచ్‌పై టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నట్లుగా ‘దాదా’ అభివర్ణించాడు. ‘ఇప్పుడు మనం చాలా క్లిష్టమైన పిచ్‌పై టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాం. బంతి వేగంగా రావడంతోపాటు స్పిన్‌ కూడా తిరుగుతోంది. బ్యాట్స్‌మన్‌ పొరపాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఆడుతూ మనం వికెట్‌ కాపాడుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. కానీ అందరం కలిసికట్టుగా ఆడి ఈ ‘టెస్టు’ను గెలుపొందాలి’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇప్పటికే కరోనా ఎంతోమందిని పొట్టన బెట్టుకోగా... మనం ఇంకా దీని వ్యాప్తి కట్టడి చేయడంపైనే దృష్టి సారిస్తున్నామని అన్నాడు.

చాలామంది ఈ మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరిలో ఒకలాంటి భయం నెలకొందని చెప్పాడు. ‘నిత్యావసరాలు అందించడానికి మా ఇంటికి అందరూ వస్తుంటే నాకు భయంగా ఉంటుంది. ఏదో తెలియని భయం ఆవహిస్తోంది. వీలైనంత త్వరగా ఈ పరిస్థితి సద్దుమణిగితే బావుండు. ఇలాంటి కఠిన పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో క్రికెట్‌ నుంచే నేర్చుకున్నా. క్రీజులో చిన్న తప్పు చేసినా, తప్పటడుగు వేసినా మనం దొరికిపోతాం. అలాంటి పరిస్థితులు అనుభవించా కాబట్టే ఇప్పుడు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటున్నా’ అని ‘దాదా’ వివరించాడు. కరోనా కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబంతోనే గడుపుతున్నా అని గంగూలీ చెప్పాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top