టీ20 క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు

Sophie Becomes 1st cricketer To Hit Five Successive 50 plus Scores - Sakshi

వెల్లింగ్టన్‌: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. బ్రెండన్‌ మెకల్లమ్‌, క్రిస్‌ గేల్‌, కోహ్లి, రోహిత్‌ శర్మలకు సాధ్యం కాని ఘనతను న్యూజిలాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సోఫీ డివైన్‌ సాధించారు. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో టీ20లో 69 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్‌ మహిళలు సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకున్నారు. ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో సోఫీ డివైన్‌ కీలక పాత్ర పోషించారు. వరుసగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20ల్లోనూ యాభైకి పరుగులు సాధించారు. దాంతో కివీస్‌ సునాయాసంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది. 

అయితే వరుసగా  యాభైకి పైగా పరుగుల్ని సాధించడం డివైన్‌కు ఐదోసారి. ఫలితంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా(పురుషులు, మహిళల కేటగిరీల్లో) ఆమె రికార్డు నెలకొల్పారు. తాజా మ్యాచ్‌లో 105 పరుగులు సాధించిన డివైన్‌.. ఈ సిరీస్‌లో 54 నాటౌట్‌, 61, 77 పరుగులు నమోదు చేశారు. ఇక మిథాలీ రాజ్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌లు వరుసగా నాలుగు హాఫ్‌ సెంచరీలను మాత్రమే సాధించగా, ఆ రికార్డునే డివైన్‌ బ్రేక్‌ చేశారు. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాల్గో మ్యాచ్‌లో కివీస్‌ మహిళలు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా మహిళలు 17 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటై పరాజయం చవిచూశారు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top