హలెప్‌ ఔట్‌

Simona Halep suffers shock defeat at US Open - Sakshi

నాదల్‌కు వాకోవర్‌

ఒసాకా, ఫెడరర్‌ ముందంజ

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌

యూఎస్‌ ఓపెన్‌లో మరో సంచలనం. నాలుగో సీడ్‌ రుమేనియన్‌ స్టార్‌ హలెప్‌ ఔట్‌...  సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్, వింబుల్డన్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ ఆట రెండోరౌండ్లోనే ముగిసింది. గత రెండేళ్లుగా ఈ టోర్నీ ఆమెకు నిరాశనే మిగిలిస్తోంది. 2017, 2018లలో తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రత్యర్థి వాకోవర్‌ ఇవ్వడంతో స్పానిష్‌ దిగ్గజం నాదల్‌ ముందంజ వేయగా, జ్వెరెవ్‌ రెండో రౌండ్లో శ్రమించి గట్టెక్కాడు.  

న్యూయార్క్‌: వింబుల్డన్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ కథ ముగిసింది. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె రెండో రౌండ్లోనే కంగుతింది. టాప్‌ సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) అలవోక విజయంతో ముందంజ వేయగా, పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ శ్రమించి రెండో రౌండ్‌ అడ్డంకిని దాటాడు. స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు ఆస్ట్రేలియా ఆటగాడు తనసి కొకినకిస్‌ నుంచి వాకోవర్‌ లభించింది. పురుషుల డబుల్స్‌లో భారత యువ ఆటగాడు దివిజ్‌ శరణ్‌ తొలిరౌండ్లోనే నిరాశ పరిచాడు.

మూడో రౌండ్లో స్విస్‌ స్టార్, మూడో సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ 6–2, 6–2, 6–1తో డానియెల్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌)పై సునాయాస విజయం సాధించాడు. కేవలం గంటా 20 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఏడో సీడ్‌ నిషికొరి (జపాన్‌)కి 2–6, 4–6, 6–2, 3–6తో డి మినర్‌ (ఆస్ట్రేలియా) చేతిలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో మూడో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–1, 4–6, 6–4తో ఓన్స్‌ జాబెర్‌ (ట్యునీషియా)ను ఓడించింది.

యూఎస్‌లో ఇంతేనా!
అమెరికన్‌ క్రీడాకారిణి టేలర్‌ టౌన్సెండ్‌ ఆరేళ్లుగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడుతోంది. కానీ... ఏ సీజన్‌లోనూ, ఏ టోర్నీలోనూ ఇప్పటి వరకు రెండో రౌండే దాటలేదు. ఇప్పుడేమో తన గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల సింగిల్స్‌లో తాజా వింబుల్డన్‌ చాంపియన్, నాలుగో సీడ్‌ హలెప్‌ (రుమేనియా)ను కంగుతినిపించింది. 116వ ర్యాంకర్‌ అయిన అమెరికన్‌ 2–6, 6–3, 7–6(7/4)తో  ప్రపంచ ఆరో ర్యాంకర్‌ హలెప్‌ కథ ముగించింది.

గత రెండేళ్లుగా మిగతా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో విజేత (ఫ్రెంచ్‌–2018), రన్నరప్‌ (ఆస్ట్రేలియా–2018, ఫ్రెంచ్‌– 2017)గా నిలుస్తున్న హలెప్‌ యూఎస్‌ ఓపెన్‌లో మాత్రం తొలిరౌండ్‌నే దాటలేకపోతోంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్‌ ఒసాకా (జపాన్‌) 6–2, 6–4తో లినెట్‌ (పోలండ్‌)పై, 19వ సీడ్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌) 4–6, 6–3, 6–4తో కొలిన్స్‌ (అమెరికా)పై, గాఫ్‌ (అమెరికా) 6–4, 4–6, 6–4తో బబొస్‌ (హంగేరి)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 6–4, 6–3తో అలిసన్‌ రిస్కే (అమెరికా)పై విజయం సాధించారు.

దివిజ్‌ జోడి ఔట్‌: పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు లియాండర్‌ పేస్‌–డ్యురన్‌ (అర్జెంటీనా) జోడీ 5–7, 2–6తో కెమెనొవిక్‌ (సెర్బియా)– కాస్పెర్‌ రుడ్‌(నార్వే) జంట చేతిలో ఓడింది. దివిజ్‌ శరణ్‌–హ్యూగో నిస్‌ (మొనాకొ) జంట 4–6, 4–6తో రాబర్ట్‌ కార్బలెస్‌–ఫెడెరికో డెల్బనిస్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.

ఐదు సెట్లవరకు పోరాటం
పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–3, 3–6, 6–2, 2–6, 6–3తో ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. జర్మనీ ఆటగాడు మ్యాచ్‌ గెలిచేందుకు 3 గంటలకు పైగా పోరాటం చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో రష్యా ఆటగాడు, 5వ సీడ్‌ మెద్వెదెవ్‌ 6–3, 7–5, 5–7, 6–3తో హ్యూగో డెలియన్‌ (బొలివియా)పై, అమెరికాకు చెందిన 14వ సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ 6–3, 7–6 (7/4), 7–6 (7/5)తో స్ట్రఫ్‌ (జర్మనీ)పై గెలుపొందారు. 22వ సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 4–6, 6–3, 7–5, 6–3తో సెడ్రిక్‌ మార్సెల్‌ స్టీబ్‌ (జర్మనీ)ను ఓడించగా, 23వ సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–4, 6–3, 6–7 (3/7), 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్‌)పై నెగ్గాడు. 13వ సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6–3, 6–2, 6–2తో మారియస్‌ కొపిల్‌ (రుమేనియా)పై, ఆస్ట్రేలియన్‌ స్టార్, 28వ సీడ్‌ కిర్గియోస్‌ 6–4, 6–2, 6–4తో ఆంటోని హోంగ్‌ (ఫ్రాన్స్‌)పై వరుస సెట్లలో గెలుపొందారు.

నయోమి ఒసాకా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top