
మరో ప్రధానిని అన్వేషించనున్న అధ్యక్షుడు మాక్రాన్
పారిస్: ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఫ్రానోయిస్ బేరూ(74) ప్రభుత్వం పడిపోయింది. సోమవారం పార్లమెంట్‌లో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 194–364 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. దేశాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వ వ్యయంలో కోత పెడుతూ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు ప్రతిపక్షం మద్దతిస్తుందని ఫ్రానోయిస్ వేసిన అంచనాలు లెక్కతప్పాయి. దీంతో ఏడాదిలో నాలుగో ప్రధానిని అన్వేషించే పనుల్లో అధ్యక్షుడు నిమగ్నమయ్యారు.
పార్లమెంట్ దిగువ సభలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రత్యర్థులదే పైచేయిగా ఉంది. అధ్యక్షుడిగా విదేశాంగ విధానం, యూరోపియన్ వ్యవహారాలు, సైనిక బలగాల కమాండర్‌గా విశేషమైన అధికారాలను కలిగి ఉన్నప్పటికీ మాక్రాన్ విధానాలపై దేశీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 జూన్‌లో అర్థంతరంగా పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. దీనిద్వారా తన అధికారం బలపడుతుందని ఆశించారు. కానీ, మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీని ప్రజలు ఇవ్వలేదు. ఫ్రాన్స్ ఆధునిక చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. దాని ఫలితంగానే ప్రభుత్వాలు తరచూ మారుతున్నాయి.