సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ  | Sikki Reddy And Ashwini Team Badminton Final In Hyderabad Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జోడీ 

Aug 10 2019 6:29 AM | Updated on Aug 10 2019 6:29 AM

Sikki Reddy And Ashwini Team Badminton Final In Hyderabad Open - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–16, 21–15తో ఎనిమిదో సీడ్‌ జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ సుమీత్‌ రెడ్డి–మను అత్రి (భారత్‌) జోడీ 21–19, 11–21, 17–21తో నా సుంగ్‌ సెయుంగ్‌–వాంగ్‌ చాన్‌ (దక్షిణ కొరియా) జంట చేతిలో... శ్లోక్‌ రామచంద్రన్‌–అర్జున్‌ (భారత్‌) ద్వయం 19–21, 9–21తో లీ జె హుయ్‌–యాంగ్‌ పు సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి.

సౌరభ్‌ వర్మ ముందంజ... 
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ సెమీఫైనల్‌కు చేరుకోగా... ఐదో సీడ్‌ శుభాంకర్‌ డే పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సౌరభ్‌ వర్మ 21–18, 21–9తో భారత్‌కే చెందిన అజయ్‌ జయరామ్‌పై నెగ్గగా... శుభాంకర్‌ డే 11–21, 16–21తో లో కీన్‌ యె (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement