వారి బౌలింగ్‌ అంత కష్టమేమి కాదు

Shreyas Iyer Says Wristspinners Was Not Difficult for Me - Sakshi

ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ : మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌యాదవ్‌, పీయూష్‌ చావ్లాలను ఎదుర్కోవడం అంత కష్టమేమి కాదని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నూతన సారథి శ్రేయస్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం కోల్‌కతాపై విజయానంతరం మాట్లాడుతూ..  ‘‘కుల్దీప్‌, చావ్లా బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత కష్టేమేమి కాదు. ఎందుకంటే నేను డొమెస్టిక్‌ క్రికెట్‌లో చాలా సార్లు వారి బౌలింగ్‌లో రాణించా. కానీ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌పై మ్యాచ్‌కు ముందు కసరత్తు చేశా. చాలా మంది ఈ రోజుల్లో ఆఫ్‌ స్పిన్‌ వేస్తున్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందే సిద్దమయ్యా. నరైన్‌ వంటి బౌలర్లు మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగలరు. వరుసగా వికెట్లు సాధిస్తూ ఒత్తిడిలోకి నెట్టెస్తారు. దీంతో అతని బౌలింగ్‌పై ప్రణాళికతో మైదానంలోకి వచ్చా. కుల్దీప్‌, చావ్లా బౌలింగ్‌ కోసం ఎదురు చూశాను. వారి బౌలింగ్‌లో సులువుగా బౌండరీలు సాధించా. అందుకోసమే తొలుత బ్యాటింగ్‌ను నెమ్మదిగా ఆరంభించా.’నని అయ్యర్‌ తెలిపాడు.

అండర్‌-19 స్టార్‌ శివం మావి చివరి ఓవర్‌పై స్పందిస్తూ.. ‘చివరి ఓవర్‌ చాలా ముఖ్యమైనది. ఇక బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌కు మరింత అవసరం. ఇంతకు ముందెప్పుడు అతని బౌలింగ్‌ ఆడలేదు. ఈ ఓవర్‌ చాలా ముఖ్యం అని భావించా. నేను కొత్త అని అతను కూడా వినూత్నంగా ప్రయత్నిద్దామని  యార్కర్లు వేసాడు. నేను అర్థం చేసుకొని స్ట్రైట్‌గా ఆడాను. అదృష్టవశాత్తు ఆ షాట్‌లు సఫలమయ్యాయి. భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలంటే చివరి ఓవర్‌ ఎంతో అవసరం అని భావించే హిట్‌ చేశాను.’’అని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. ఈ ఓవర్‌ అయ్యర్‌ నాలుగు సిక్స్‌ల, ఓక ఫోర్‌తో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.  అయ్యర్‌ భారీ ఇన్నింగ్స్‌తో కోల్‌కతాపై ఢిల్లీ 55 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top