కోచ్‌లు వస్తారు..పోతారు: మాలిక్‌

Shoaib Malik Responds To Journalist's Hilarious Question - Sakshi

సచిన్‌ ఏనాడైనా చెప్పాడా..?

లాహోర్‌: బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. దాదాపు ఏడాది తర్వాత తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌ (45 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 

అయితే మ్యాచ్‌ తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాలిక్‌కు ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘ మీరు కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ కంటే చాలా సీనియర్‌ ప్లేయర్‌ కదా.. జట్టు విజయం సాధించే బాధ్యతను భుజాలపై వేసుకోవడంతో పాటు ఎంపికలో మిస్బాను దాటి ఏమైనా పెద్దన్న పాత్ర పోషించారా? అని రిపోర్టర్‌ ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. దీనికి మాలిక్ సమాధానమిస్తూ.. ‘నేర్చుకునే ప్రాసెస్‌ అనేది ఎప్పటికీ అంతం కాదు. ఎవరైనా నేర్చుకుంటూనే ముందుకు సాగుతారు. ప్రపంచంలో ఎవరినైనా చూడండి.. అంతా నేర్చుకున్న మనిషి అంటూ ఉండడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తాను క్రికెట్‌లో మొత్తం నేర్చుకున్నానని ఏనాడైనా చెప్పాడా. లేకపోతే ఏ ఒక్కరైనా చెప్పారా.. చెప్పలేరు కదా.

అంటే మనం నేర్చుకోవడం అనేది ఎప్పటికీ అంతం కాదు. చాలా మంది క్రికెటర్లు, కోచ్‌లు వస్తూ పోతూ ఉంటారు. నువ్వు నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆగదు. ఎప్పుడూ కూడా ఓవర్‌నైట్‌ రిజల్ట్స్‌ అనేవి ఉండవు. ఇప్పుడు మా జట్టు యువ క్రికెటర్లతో నిండి ఉంది. మా వాళ్లు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. సత్తాచాటుకోవడానికి కొంత సమయమైనా అవసరం. అందుకు ఓపిక పట్టాలి. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మసాలా(వార్తలను ఉద్దేశించి)  కావాలి. ప్రతీ ఒక్కరూ, ప‍్రతీదాంట్లో మసాలా కోరుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశం కోసం కూడా ఆలోచించండి’ అని మాలిక్‌ బదులిచ్చాడు. (ఇక్కడ చదవండి: పాక్‌ను గెలిపించిన షోయబ్‌ మాలిక్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top