సెరెనా సాధించెన్‌...

Serena Williams Wins First Title In Three Years - Sakshi

తల్లి అయ్యాక తొలి టైటిల్‌ నెగ్గిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌

ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌): ఎట్టకేలకు అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ టైటిల్‌ నిరీక్షణకు తెరదించింది. తల్లి అయ్యాక ఆమె తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఏఎస్‌బీ క్లాసిక్‌ ఓపెన్‌ టోర్నీలో సెరెనా సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6–3, 6–4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం. ఎనిమిది వారాల గర్భవతిగానే 2017 ఆ్రస్టేలియా ఓపెన్‌లో పాల్గొని చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది.

అదే ఏడాది సెప్టెంబర్ లో పాప కు జన్మనిచ్చిన సెరెనా 2018 మార్చిలో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది. 2018 వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో... 2019 వింబుల్డన్, రోజర్స్‌ కప్, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో ఫైనల్‌ చేరినా రన్నరప్‌ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. అయితే ఫైనల్‌ చేరిన ఆరో టోరీ్నలో సెరెనా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సెరెనా కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు 43 వేల డాలర్లు ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 52 వేలు) లభించింది. ఈ మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన బుష్‌ఫైర్‌ రిలీఫ్‌ ఫండ్‌కు సెరెనా విరాళంగా ఇచ్చేసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top