
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కోపానికి గురైతే తనకు భయమేస్తుందని యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అన్నాడు. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలోనూ అతను రాణిస్తున్నాడు. దీంతో ధోని స్థానాన్ని భర్తీ చేయగలడనే కితాబు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ ఓ వీడియోలో ‘సహజంగా నేనెవరికీ భయపడను. కానీ... విరాట్ భయ్యాకు కోపమొస్తే మాత్రం భయపడతాను.
అయినా తప్పుచేయకుంటే కోహ్లి ఎందుకు కోపగించుకుంటాడు? ఎవరైనా మనపై ఆగ్రహించాడంటే అది మన మంచికే. మనం చేసిన పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రిషభ్ పంత్... ధోని శైలీలో వికెట్లను చూడకుండా రనౌట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వికెట్ పడకపోగా ఓ పరుగు వచ్చింది. దీంతో కోహ్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.