సాయిప్రణీత్, శ్రీకాంత్‌ ఇంటిముఖం | Sai Praneeth And Kidambi Srikanth Loss Tokyo Olympics | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్, శ్రీకాంత్‌ ఇంటిముఖం

Jan 9 2020 12:28 AM | Updated on Jan 9 2020 12:28 AM

Sai Praneeth And Kidambi Srikanth Loss Tokyo Olympics - Sakshi

కౌలాలంపూర్‌: టోక్యో ఒలింపిక్స్‌ రేసులో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌ కొత్త సీజన్‌ను పరాజయంతో ప్రారంభించారు. మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లతోపాటు మరో తెలుగు షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 11–21, 15–21తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ రస్‌ముస్‌ జెమ్కె (డెన్మార్క్‌) చేతిలో... ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 17–21, 5–21తో రెండో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... ప్రపంచ 23వ ర్యాంకర్‌ కశ్యప్‌ 17–21, 16–21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయారు.

రస్‌ముస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ రెండు గేముల్లోనూ ఆరంభంలోనే ఆధిక్యం కోల్పోయి ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. మరోవైపు చౌ తియెన్‌ చెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ కేవలం 30 నిమిషాల్లో చేతులెత్తేశాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ రెండో గేమ్‌లో మాత్రం కేవలం ఐదు పాయింట్లు సాధించాడు. అయితే భారత్‌కే చెందిన సమీర్‌ వర్మ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ శుభారంభం చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ 21–16, 21–15తో వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)పై... ప్రణయ్‌ 21–9, 21–17తో కాంటా సునెయామ (జపాన్‌)పై గెలిచారు.

నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెంటో మొమోటాతో ప్రణయ్‌; లీ జి జియా (మలేసియా)తో సమీర్‌ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహా్వల్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సింధు 21–15, 21–13తో ఎవ్‌గెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై... సైనా 21–15, 21–17తో లియాన్‌ తాన్‌ (బెల్జియం)పై విజయం సాధించారు. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్‌)తో సింధు; ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో సైనా పోటీపడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 10–21, 10–21తో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సి వె–హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement