మేం ఎవరికీ భయపడం: రోహిత్‌

Rohit Says Team India Are Not Scared Of Any Opposition - Sakshi

ముంబై: కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలోని వెస్టిండీస్‌ జట్టుపై టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా పొలార్డ్‌ కెప్టెన్సీని కొనియాడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తో పొలార్డ్‌ సామర్థ్యం, ఆలోచనల గురించి క్షుణ్ణంగా తెలుసన్నాడు. ఇక గత సీజన్‌లో తాను గైర్హాజరీ నేపథ్యంలో ఓ మ్యాచ్‌కు పొలార్డ్‌ సారథ్యం వహించాడని, ఆ సమయంలో అతడి వ్యూహాలు, గెలవాలనే తపన, ఫీల్డ్‌లో ఆటగాళ్లను సరిగ్గా సద్వినియోగం చేసుకునే తీరును దగ్గర్నుంచి చూశానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడు చాలా ఆత్మవిశ్వా​సంతో, సహచర ఆటగాళ్లపై ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తాడన్నాడు. టీ20ల్లో విండీస్‌ అనూహ్యమైన జట్టని, ప్రతీ ఒక్క ఆటగాడు క్షణాల్లో ఆటను పూర్తిగా మార్చగలరని ప్రశంసించాడు. అయితే మేము ఏ జట్టుకు భయపడమని రోహిత్‌ స్పష్టం చేశాడు. 

‘వెస్టిండీస్‌ చాల అనూహ్యమైన జట్టు. టీ20ల్లో అసాధారణ రీతిలో ఆడుతోంది. ముఖ్యంగా పొలార్డ్‌ సారథ్యంలోని ఆ జట్టు చాలా పరిణితి చెందుతోంది. ఆ జట్టులోని దాదాపు అందరాటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ20లు ఆడుతున్నారు. దీంతో ఈ ఫార్మట్‌లో వారు విశేషంగా రాణిస్తున్నారు. ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రతి రెండు బంతులకో ఒక సిక్సర్‌ కొట్టడానికి వారు ప్రయత్నిస్తుంటారు. దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ అంటే చాలెంజింగ్‌గా తీసుకున్నాం. ఎందుకంటే ఆ జట్టులో పవర్‌ హిట్టర్లు ఉన్నారు. ఈ తరుణంలో బౌలర్లకు పెద్ద పరీక్ష వంటిది. అయితే మేము ఏ జట్టుకు భయపడం. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే మేమే గెలుస్తాం. అయితే మాకంటే వారి ప్రణాళికలు గొప్పగా ఉంటే వారే గెలుస్తారు. 

ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో వారి ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. హైదరాబాద్‌ మ్యాచ్‌లో కోహ్లి సహాయంతో టీ20ల్లో భారీ స్కోర్‌ను ఛేజ్‌ చేశాం. అయితే రెండో మ్యాచ్‌లో చతికిలపడ్డాం. ఆ మ్యాచ్‌లో అనేక పొరపాట్లు చేశాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో పూర్తిగా వైఫల్యం చెందాం. ముందగా ప్రత్యర్థి జట్టు ముందు భారీ స్కోర్‌ ఉంచలేకపోయినప్పటికీ పోరాడే స్కోరే సాధించాం. కానీ బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో విఫలమవ్వడంతో ఓటమి చవిచూశాం. అయితే ఈ లోపాలన్ని సరిదిద్దుకొని నిర్ణయాత్మకమైన మూడో టీ20 కోసం బరిలోకి దిగుతాం. సిరీస్‌ సాధిస్తామనే విశ్వాసం మాకు ఉంది’అంటూ రోహిత్‌ పేర్కొన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top