ఆస్ట్రేలియా అదుర్స్ | Rio Olympics 2016: Murray beats Troicki, fencing, football and more | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా అదుర్స్

Aug 8 2016 2:13 AM | Updated on Sep 4 2017 8:17 AM

ఆస్ట్రేలియా అదుర్స్

ఆస్ట్రేలియా అదుర్స్

స్విమ్మింగ్‌తోపాటు ఆర్చరీ ఈవెంట్‌లోనూ రాణించిన ఆస్ట్రేలియా రియో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో అగ్రస్థానంలో ఉంది.

రియో డి జనీరో : స్విమ్మింగ్‌తోపాటు ఆర్చరీ ఈవెంట్‌లోనూ రాణించిన ఆస్ట్రేలియా రియో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలతో అగ్రస్థానంలో ఉంది. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో మాక్ హోర్టాన్ స్వర్ణం నెగ్గి ఆస్ట్రేలియా ఖాతాలో రెండో పసిడి పతకాన్ని చేర్చాడు. హోర్టాన్ 3 నిమిషాల 41.55 సెకన్లలో లక్ష్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు మహిళల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఆసీస్ బృందం బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఆర్చరీ పురుషుల టీమ్ విభాగంలో అలెక్స్ పాట్స్, రియాన్ ట్యాక్, టేలర్ వర్త్‌లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు కాంస్య పతక పోరులో 6-2తో చైనాను ఓడించింది. ఒలింపిక్స్ ఆర్చరీలో ఆస్ట్రేలియా జట్టుకు కాంస్య పతకం లభించడం ఇదే తొలిసారి.

 మహిళల జూడో 48 కేజీల విభాగంలో పౌలా పరెటో (అర్జెంటీనా) స్వర్ణం సాధించింది. ఫైనల్లో పరెటో 2-0తో బోక్‌యోంగ్ జియోంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. ఒలింపిక్స్ జూడో చరిత్రలో అర్జెంటీనాకు లభించిన తొలి పసిడి పతకం ఇదే కావడం విశేషం. పురుషుల జూడో 60 కేజీల విభాగంలో బెస్లాన్ ముద్రనోవ్ చాంపియన్‌గా నిలిచి రష్యాకు తొలి స్వర్ణాన్ని అందించాడు.

తొలి రోజు పసిడి కొట్టలేకపోయిన చైనా రెండో రోజు ఆ లోటు తీర్చుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మెంగ్‌జుయ్ జాంగ్ విజేతగా నిలిచి చైనాకు తొలి బంగారు పతకాన్ని అందించింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత ఈపీ ఈవెంట్‌లో ఎమెస్ జాస్ (హంగేరి) పసిడి పతకాన్ని దక్కించుకుంది. పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో కొసుకె హగినో (జపాన్)... మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో సొపితా తనసాన్ (థాయ్‌లాండ్) స్వర్ణాలు గెల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement