'ఆ వివాదం చాలా రోజులు వెంటాడింది'

Ricky Ponting Reveals Monkeygate Scandal Against India - Sakshi

సిడ్నీ : 2008లో జరిగిన 'మంకీ గేట్‌ వివాదం' క్రికెట్‌ ప్రేమికులెవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. భారత సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదంపై తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘటనను  మరోసారి గుర్తు చేశాడు. 'బహుశా మంకీ గేట్ వివాదం నా కెప్టెన్సీ కెరీర్‌లోనే అత్యంత హీనమైన ఘటన. 2005 యాషెస్ సిరీస్‌ ఓటమి కూడా కఠినమైనదే. కానీ ఈ సిరీస్ ఓటమి అనేది నా నియంత్రణలో జరిగింది. కానీ మంకీగేట్ వివాదం చోటు చేసుకున్నప్పుడు మాత్రం నేనేం చేయలేకపోయాను. ఇది చాలా రోజులు మమ్మల్ని వెంటాడింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కోసం మైదానంలోకి వస్తుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగింపులో ఈ వివాదంపై విచారణ జరిగింది. మంకీగేట్ వివాదం తుది ఫలితంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఇది మా తదుపరి మ్యాచ్ ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు గెలుస్తామనుకున్నాం... కానీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే')

2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్‌ సింగ్‌ తనను మంకీ అంటూ జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్‌ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్‌ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పటి అప్పీల్‌ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో బజ్జీకి శిక్షను రద్దు చేశారు.
(క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ బ్యాట్‌ చోరీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top