‘హమ్మయ్య ఎట్టకేలకు సెంచరీ సాధించా’

Ravindra Jadeja Scores Maiden International Hundred - Sakshi

రాజ్‌కోట్‌: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని మూడు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన ఘనత అతడి సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయినా ఒక్క శతకం నమోదు కాలేదు.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన మ్యాచ్‌ ఒక్కటి కూడా లేదు. ఆల్‌రౌండర్‌గా డొమెస్టిక్‌ క్రికెట్‌లో అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో ఒంటి చేత్తో విజయాలను అందించాడు రవీంద్ర జడేజా. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోయాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జడేజా.. కొద్ది రోజుల్లోనే రెగ్యులర్‌ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడ్డూ బౌలర్‌గానే స్థిర పడ్డాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది చాలా తక్కువ. ఇక తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకోడానికి తొమ్మిదేళ్లు పట్టింది. రాజ్‌కోట్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో జడేజా తొలి శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం జడేజా మీడియా ముందు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. (ఓయ్‌ జడ్డూ.. ఏంటిది?)

ఇంగ్లండ్‌ సిరీస్‌లో విశ్వాసం ఏర్పడింది..
‘ఈ రోజు సెంచరీ చేసిన ఆ మధురాతి క్షణం ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తొమ్మిదేళ్లకు తొలి సెంచరీ సాధించాను అందుకే చాలా స్పెషల్‌. అందులోనూ సొంత మైదానంలో కాబట్టి ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీసారి 70-80 స్కోర్‌ చేయగానే సెంచరీ చేయాలనే ఆరాటంలో వికెట్‌ పారేసుకునేవాడిని. కానీ ఈ రోజు సెంచరీ మార్క్‌ చేరాలని కసిగా ఆడాను. డొమెస్టిక్‌ క్రికెట్‌లో భారీ శతకాలు సాధించిన నేను.. ఇక్కడ కూడా సెంచరీలు సాధించగలననే నమ్మకం ఏర్పడింది. ఇంగ్లండ్‌లో నా బ్యాటింగ్‌ తీరుతో మరింత విశ్వాసం పెరిగింది. 15 నెలల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడాను. ఆసియాకప్‌లోనూ రాణించాను. ఫార్మట్‌ ఏదైనా నా శైలిలో రాణించేందుకు కష్టపడతా’ అంటూ జడేజా పేర్కొన్నాడు.

అలా ఊహించలేదు
ఈ రోజు మ్యాచ్‌లో జరిగిన రనౌట్‌ సంఘటన గురించి స్పందించాడు. ‘ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఒకే ఎండ్‌లో ఉండటంతో సులువుగా ఔట్‌ చేయొచ్చని అనుకున్నాను. అందుకే నేరుగా బంతితో వికెట్లను గిరటేద్దామనుకుని.. వికెట్ల వైపు నడుచుకుంటూ వస్తున్నాను. కానీ అవతలి ఎండ్‌ నుంచి హెట్‌మెయిర్‌ పరిగెత్తుకొస్తున్న విషయాన్ని గమనించలేదు. సహచరులు అలర్ట్‌ చేయడంతో బంతిని వికెట్లుకు నేరుగా విసిరాను. అదృష్టం బాగుండి బంతి వికెట్లను తాకింది. లేకుంటే భారీ తప్పిదం జరిగి ఉండేది. థ్యాంక్‌ గాడ్‌’ అంటూ జడేజా వివరణ ఇచ్చాడు. 

చదవండి:

తొలి టెస్టు.. విండీస్‌ విలవిల

జడేజా సెంచరీ.. కోహ్లి సేన డిక్లేర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top