టైటిల్‌కు విజయం దూరంలో...

PV Sindhu beats Chen Yu Fei to march into final - Sakshi

ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు

సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫెపై విజయం

నేటి ఫైనల్లో నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచితో అమీతుమీ

మధ్యాహ్నం గం. 12.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

మరోసారి సాధికారిక ప్రదర్శనతో అలరించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. సీజన్‌లో తొలి టైటిల్‌ లోటును తీర్చుకునేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి తుది సమరానికి అర్హత సాధించింది.   

జకార్తా: నెల రోజులపాటు లభించిన విరామ సమయంలో పక్కా ప్రణాళికతో సాధన చేసిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 46 నిమిషాల్లో 21–19, 21–10తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా)పై గెలిచింది.

ఈ ఏడాది సింగపూర్‌ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో వెనుదిరిగిన ఈ తెలుగమ్మాయి తాజా గెలుపుతో సీజన్‌లో తొలి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–4తో యామగుచిపై ఆధిక్యంలో ఉంది. రెండో సెమీఫైనల్లో అకానె యామగుచి 21–9, 21–15తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)ను బోల్తా కొట్టించింది.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, స్విస్‌ ఓపెన్, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ సాధించి జోరు మీదున్న చెన్‌ యుఫె ఆటలు సింధు ముందు సాగలేదు. తొలి గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. నాలుగుసార్లు చెన్‌ యుఫె ఆధిక్యంలోకి వెళ్లినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. సింధు 14–18తో వెనుకబడిన దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 19–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్‌ యుఫె ఒక పాయింట్‌ సాధించగా... ఆ వెంటనే సింధు రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌ ఆరంభంలో సింధు తడబడినట్లు కనిపించినా వెంటనే గాడిలో పడింది. 2–5తో వెనుకబడిన దశలో సింధు వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 9–5తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత స్కోరు 10–8తో ఉన్నదశలో సింధు వరుసగా 8 పాయింట్లు సాధించి 18–8తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

3 ఇండోనేసియా ఓపెన్‌లో భారత్‌ తరఫున ఫైనల్‌ చేరిన మూడో ప్లేయర్‌గా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్‌ వరుసగా నాలుగుసార్లు (2009, 2010, 2011, 2012) ఫైనల్‌ చేరి మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్‌ గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 2017లో విజేతగా నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top