సెమీస్‌లో అవధ్‌ వారియర్స్‌ | Premier Badminton League: Awadhe Warriors secure second position | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అవధ్‌ వారియర్స్‌

Jan 8 2019 1:50 AM | Updated on Jan 8 2019 1:50 AM

Premier Badminton League: Awadhe Warriors secure second position - Sakshi

బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌– 4)లో అవధ్‌ వారియర్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోరులో వారియర్స్‌ 4–3తో చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో లీ యంగ్‌–క్రిస్టియన్సెన్‌ ద్వయం 15–8, 15–6తో క్రిస్‌ అడ్‌కాక్‌–సుమిత్‌ రెడ్డి (చెన్నై) జంటపై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ అవధ్‌కు ‘ట్రంప్‌’ కావడంతో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్‌ తొలి పోరులో లీ డాంగ్‌ క్యున్‌ (వారియర్స్‌) 15–7, 15–13తో వీ ఫెంగ్‌ చోంగ్‌ (చెన్నై)పై గెలుపొందగా, చెన్నైకి ‘ట్రంప్‌’ అయిన మహిళల సింగిల్స్‌లో సుంగ్‌ జీ హ్యున్‌ 15–13, 15–8తో బీవెన్‌ జాంగ్‌ (వారియర్స్‌)ను ఓడించింది. దీంతో అవధ్‌ ఆధిక్యం 3–2కు తగ్గింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గ్యాబ్రియెల్‌ అడ్‌కాక్‌ (చెన్నై)జోడీ 15–13, 9–15, 15–14తో క్రిస్టియన్సెన్‌–అశ్విని పొన్నప్ప (వారియర్స్‌) జంటపై నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. నిర్ణాయక పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో సన్‌ వాన్‌ హో (వారియర్స్‌) 15–6, 15–6తో రాజీవ్‌ ఉసెఫ్‌ (చెన్నై)పై గెలిచి అవధ్‌కు విజయాన్నందించాడు. ఇప్పటికే ముంబై రాకెట్స్, హైదరాబాద్‌ హంటర్స్‌ సెమీస్‌ బెర్తులు సాధించాయి. నేడు బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement