కేకేఆర్‌ ఆటగాడికి బీసీసీఐ షాక్‌!

Pravin Tambe Not Eligible To Play In IPL As Per BCCI Rules - Sakshi

ఐపీఎల్‌ ఆడే చాన్స్‌ కోల్పోయిన వెటరన్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కోసం జరిగిన వేలంలో ముంబైకి చెందిన 48 ఏళ్ల వెటరన్‌ ఆటగాడు ప్రవీణ్‌ తాంబేను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలకే తాంబేను తీసుకుంది. తాంబే కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో చివరకు కేకేఆర్‌ బిడ్‌కు వెళ్లింది. అక్కడ మిగతా ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి పోటీ లేకపోవడంతో తాంబే కేకేఆర్‌ సొంతమయ్యాడు. అయితే తాంబే ఐపీఎల్‌ ఆడటానికి అర్హత కోల్పోయాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10లో సింథిస్‌ తరఫున ఆడిన తాంబే.. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) రూల్స్‌ను అతిక్రమించాడు. ఐపీఎల్‌లో కానీ, భారత జట్టు తరఫున ఆడాలనుకునే ఏ క్రికెటర్‌ కూడా విదేశీ లీగ్‌లో పాల్గొనకూడదనేది బీసీసీఐ రూల్‌. ఒకవేళ ఆడాలనుకుంటే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్న తర్వాతే వేరే విదేశీ లీగ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీన్ని తాంబే బ్రేక్‌ చేయడంతో ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. 

‘బీసీసీఐ రూల్స్‌ ఏమి చెబుతున్నాయో విదేశీ లీగ్‌లు ఆడాలనుకునే భారత క్రికెటర్లు తెలుసుకోవాలి.  ఐపీఎల్‌ ఆడాలనుకుంటే విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదు. ఒకవేళ  విదేశీ లీగ్‌లపై ఆసక్తి ఉంటే ఐపీఎల్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో భాగంగా ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో తాంబే తన పేరును పంపాడు. అదే సమయంలో ఐపీఎల్‌ వేలానికి కూడా వచ్చాడు. ఇది బీసీసీఐ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించడమే. దాంతో తాంబే ఐపీఎల్‌ ఆడటానికి అనర్హుడు’ బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు వయసురీత్యా అర్ధసెంచరీ కొట్టబోతున్న వెటరన్‌ స్పిన్నర్‌ తాంబే ఐపీఎల్‌లో ఇదివరకు రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ లయన్స్‌ (ఇప్పుడు లేదు), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తాంబే.. మొత్తంగా 33 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top