ఫైనల్‌కు పిమ్రదా, సందీప్తి | Pimrada And Sandeepthi Enters Final Of ITF Tourney | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు పిమ్రదా, సందీప్తి

Aug 30 2019 9:58 AM | Updated on Aug 30 2019 9:58 AM

Pimrada And Sandeepthi Enters Final Of ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–4 టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్‌ పిమ్రదా జటావపోర్నవిట్‌ (థాయ్‌లాండ్‌), ఎనిమిదో సీడ్‌ సందీప్తి సింగ్‌ (భారత్‌) ఫైనల్‌కు చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన అండర్‌–18 బాలికల సింగిల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌ల్లో పిమ్రదా 6–1, 6–3తో నాలుగో సీడ్‌ యిఫాన్‌ సున్‌ (చైనా)పై గెలుపొందగా... సందీప్తి సింగ్‌ 6–3, 6–4తో హైదరాబాద్‌ ప్లేయర్‌ వినీత ముమ్మడిని ఓడించింది. బాలుర సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు చిరాగ్‌ దుహాన్, ధ్రువ్‌ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో చిరాగ్‌ 7–5, 3–6, 1–6తో పటోర్న్‌ హన్‌చైకుల్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, ధ్రువ్‌ 2–6, 6–4, 5–7తో అదిత్‌ సిన్హా (అమెరికా) చేతిలో ఓడిపోయారు.

బాలికల డబుల్స్‌ విభాగంలో భారత జోడీలు సెమీస్‌లో ఓటమి పాలవ్వగా... బాలుర డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరుకున్నారు. అండర్‌–18 బాలుర డబుల్స్‌ తొలి సెమీస్‌లో ఆర్యన్‌ భాటియా–చిరాగ్‌ దుహాన్‌ (భారత్‌) జోడీకి చైనా జోడీ నుంచి వాకోకవర్‌ లభించింది. రెండో సెమీస్‌లో నిశాంత్‌ దబాస్‌ (భారత్‌)–తనపట్‌ నిరున్‌డోర్న్‌ (థాయ్‌లాండ్‌) జంట 7–6 (7), 2–6, 10–5తో సంజీత్‌ దేవినేని (అమెరికా)–ఉదిత్‌ గొగోయ్‌ (భారత్‌) జోడీపై గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ సారాదేవ్‌–ప్రేరణ విచారే (భారత్‌) ద్వయం 2–6, 1–6తో టాప్‌సీడ్‌ పిమ్రదా–లాన్‌లనా (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో, వినీత–సందీప్తి (భారత్‌) జోడీ 2–6, 0–6తో యటావీ చిమ్‌చమ్‌ (థాయ్‌లాండ్‌)–మల్లికా (భారత్‌) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి ని్రష్కమించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement