
నాకు పాక్ కోచ్ పదవి వద్దు!
పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి చేపట్టడానికి ఇంగ్లండ్ మాజీ కోచ్ పీటర్మూర్స్ విముఖత వ్యక్తం చేశాడు.
లండన్:పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవి చేపట్టడానికి ఇంగ్లండ్ మాజీ కోచ్ పీటర్మూర్స్ విముఖత వ్యక్తం చేశాడు. పాక్ క్రికెట్ జట్టు కోచ్ పదవిని చేపట్టడానికి ఆహ్వానం అందినట్లు తెలిపిన మూర్స్... అందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉంటూ నాటింగ్హమ్షైర్కు కన్సెల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు మూర్స్ పేర్కొన్నాడు.
' కోచ్ పదవి కోసం నన్ను పీసీబీ సంప్రదించింది. దాని గురించే ఆలోచిస్తే ఇది సరైన సమయం కాదనే అనుకుంటున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా. నా పిల్లలు కూడా పెరుగుతున్నారు. దాంతో పాటు నాటింగ్హమ్షైర్తో ఒప్పందం ఉంది. ఈ సమయంలో పాక్ కోచ్ పదవిని చేపట్టలేను'అని మూర్స్ తెలిపాడు. గతేడాది ఇంగ్లండ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన మూర్స్ ఆ జట్టుకు రెండు సార్లు కోచ్ గా పని చేశాడు.