పట్టుబిగించిన పాక్‌

Pakistan vs Sri Lanka Second Test At karachi - Sakshi

వరుసగా రెండో సెంచరీతో ఆబిద్‌ అలీ రికార్డు

శ్రీలంకతో రెండో టెస్టు  

కరాచి: లేటు వయసు (32 ఏళ్లు)లో టెస్టు అరంగేట్రం చేసిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఆబిద్‌ అలీ మళ్లీ అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన తన అరంగేట్రం టెస్టులో శతకంతో కదంతొక్కిన అతను... తాజాగా రెండో టెస్టులోనూ సెంచరీ (281 బంతుల్లో 174; 21 ఫోర్లు, సిక్స్‌)తో ఆకట్టుకున్నాడు. దాంతో ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా ఆబిద్‌ చరిత్రకెక్కెడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన వన్డే, టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా ఆబిద్‌ అలీ ఇప్పటికే తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు.

ఆబిద్‌కు మరో ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ శతకం (198 బంతుల్లో 135; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా తోడవడంతో పాకిస్తాన్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 395 పరుగులు చేసింది. దీంతో 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అజహర్‌ అలీ (57 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (22 బ్యాటింగ్‌; ఫోర్‌) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 57/0తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ ఓపెనర్లు ఆబిద్, మసూద్‌ శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 278 పరుగులు జోడించారు. పాకిస్తాన్‌కు టెస్టుల్లో తొలి వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అమీర్‌ సోహైల్‌– ఇజాజ్‌ అహ్మద్‌ (1997) జోడీ ఇదే గ్రౌండ్‌లో వెస్టిండీస్‌పై నెలకొలి్పన 298 పరుగుల భాగస్వామ్యం తొలి స్థానంలో ఉంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top