పాకిస్తాన్‌ క్లీన్‌ స్వీప్‌

Pakistan beat Zimbabwe by 131 runs to win ODI series - Sakshi

చివరి వన్డేలో జింబాబ్వేపై 131 పరుగులతో గెలుపు

ఇమామ్, బాబర్‌ సెంచరీలు

బులవాయో: జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో జయభేరి మోగించిన పాక్‌ ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇమామ్‌–ఉల్‌–హఖ్‌ (105 బంతుల్లో 110; 8 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (76 బంతుల్లో 106 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇమామ్‌కు ఈ సిరీస్‌లో ఇది మూడో సెంచరీ. మరో ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (83 బంతుల్లో 85; 10 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇమామ్‌ తొలి వికెట్‌కు 168 పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. ఓపెనింగ్‌ జోడీ వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఈ సిరీస్‌లో ఇది నాలుగోసారి. మూడు రోజుల క్రితం నాలుగో వన్డేలో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన ఫఖర్‌ జమాన్‌ ఈ మ్యాచ్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ ఆరో ఓవర్‌ చివరి బంతికి బౌండరీ బాది వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.

వెయ్యి పరుగులు చేయడానికి ఫఖర్‌ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ (21 ఇన్నింగ్స్‌లలో) పేరిట ఉంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 233 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కెప్టెన్‌ మసకద్జా (34), కమున్‌హుకమ్వే (34), ప్రిన్స్‌ మస్‌వౌర్‌ (39), ముర్రే (47), మూర్‌ (44 నాటౌట్‌), చిగుంబురా (25 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, నవాజ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బాబర్‌ ఆజమ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఫఖర్‌ జమాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top