కివీస్‌తో టీ20: టీమిండియా చిత్తుచిత్తుగా

New Zealand Won By 80 Runs In 1st T20 Against India - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో రోహిత్‌ సేన ఘోరంగా తడబడింది. దీంతో 80 పరుగుల తేడాతో రోహిత్‌ సేన ఘోర పరాజయం చవిచూసింది. భారత బ్యాట్స్‌మెన్‌ పరుగుల విషయం పక్కకు పెడితే కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడ్డారు. దీంతో 19.2ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సీనియర్‌ ఆటగాడు ధోని (39), ధావన్‌(29), విజయ్‌ శంకర్‌(27), కృనాల్‌(20)లు రాణించడంతో టీమిండియా కనీస గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, ఫెర్గుసన్‌, సాన్‌ట్నర్, ఇష్‌ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టగా మిచెల్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 

పరుగులు ఇచ్చారు.. కానీ రాబట్టలేకపోయారు
టాస్‌ గెలిచి తొలుతు ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు టీ20లో తమ సత్తా ఏంటో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతీ బ్యాట్స్‌మన్‌ తమ వంతు కృషిగా పరుగులు రాబట్టారు. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడును అడ్డుకోలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. కివీస్‌ ఓపెనర్‌ సీఫ్రెట్‌ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చూపించగా.. కొలిన్‌ మున్రో(34: 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విలియమ్సన్‌ (34: 22 బంతుల్లో 3 సిక్సర్లు) భారత బౌలర్లను ఆడుకున్నారు. చివర్లో స్కాట్‌ కుగ్లీన్ 7 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యాన్ని చేదించే దిశగా పయనించలేదు. తొలుత తాత్కాలిక సారథి, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(1) దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్‌ విఫలమైన మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దాటిగా ఆడే  ప్రయత్నం చేశాడు. కానీ కివీస్‌ బౌలర్‌ ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో ధావన్‌(29) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. టీమిండియా నయా సంచలన ఆటగాడు పంత్‌(1)కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. స్కోర్‌ పెంచే క్రమంలో విజయ్‌ శంకర్‌(27) కూడా క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతర క్రీజులోకి వచ్చి రాగానే బౌండరీ బాది ఆశలు రేపిన పాండ్యా(4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ధోనితో కలిసి టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసిన కృనాల్‌(20) కూడా కీపర్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో ధోని(39), భువనేశ్వర్‌(1), చహల్‌(1)లు వెంటవెంటనే వెనుదిరగడంతో తొలి టీ20లో టీమిండియా కథ ముగిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top