బ్రాత్‌వైట్‌ సెంచరీతో పోరాడినా...

New Zealand beat West Indies by five runs - Sakshi

5 పరుగులతో ఓడిన విండీస్‌

విండీస్‌ లక్ష్యం 292. స్కోరు 142/4గా ఉన్న దశలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ క్రీజులోకి వచ్చాడు. ఇంకో మూడు ఓవర్లయ్యాక చూస్తే 164/7. ఇక జట్టు ఓటమికి మూడే అడుగుల దూరం. విజయానికి మాత్రం 128 పరుగుల సుదూర ప్రయాణం ఈ దశలో బ్రాత్‌వైట్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. 9 బౌండరీలు, 5 భారీ సిక్సర్లతో ‘మ్యాచ్‌ సీన్‌’ మార్చేశాడు. టెయిలెండర్ల అండతో మెరుపు సెంచరీ సాధించాడు.

ఇక 7 బంతుల్లో ఆరే పరుగులు కావాలి. ఆఖరి వికెట్‌ కావడం... అందునా అవతలి వైపు బ్యాట్స్‌మన్‌ లేకపోవడంతో సిక్స్‌తో ఆట ముగించేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని దురదృష్టం వెంటాడింది. లాంగాన్‌ బౌండరీ వద్ద బౌల్ట్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. కివీస్‌ ఊపిరిపీల్చుకోగా బ్రాత్‌వైట్‌ కుప్పకూలాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల సాంత్వనతో తేరుకున్నాడు.   

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు రసవత్తరంగా ముగిశాయి. భారత్‌ పసికూన అఫ్గాన్‌పై గెలిచేందుకు ఆఖరిదాకా పోరాడితే... కివీస్‌ను ఓడించేందుకు విండీస్‌ శక్తిమేర శ్రమించింది. కానీ వెస్టిండీస్‌ 5 పరుగుల దూరంలో ఆలౌటైంది. బ్రాత్‌వైట్‌ (82 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వరల్డ్‌కప్‌లో చరిత్రకెక్కే సెంచరీ సాధించాడు. మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు గెలిచింది. పోరాటంతో బ్రాత్‌వైట్‌ కూడా గెలిచాడు. ఉత్కంఠభరిత మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో మొదట కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను ఓపెనర్‌ గేల్‌ (84 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ (45 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్‌) నడిపించారు. కానీ కీలకమైన సమయంలో ఫెర్గుసన్‌ (3/59), బౌల్ట్‌ (4/30) విండీస్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బమీద దెబ్బతీశారు. 164 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన కరీబియన్‌ జట్టు పరాజయానికి దగ్గరైంది. ఈ దశలో బ్రాత్‌వైట్, కీమర్‌ రోచ్‌ (31 బంతుల్లో 14; 1 సిక్స్‌)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 47 పరుగులు, కాట్రెల్‌కు జతగా తొమ్మిదో వికెట్‌కు 34 పరుగులు జోడించాడు. ఆఖరికి ఖాతా తెరవని థామస్‌ (0 నాటౌట్‌)ను కూడా కాచుకొని పదో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు.

18 బంతుల్లో 33 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్‌ వేసిన హెన్రీ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్‌ జూలు విదిల్చాడు. 2, 6, 6, 6, 4, 1తో 25 పరుగులు పిండుకున్నాడు. ఇక 12 బంతుల్లో 8 పరుగులే కావాలి. నీషమ్‌ ఓవర్లో సింగిల్స్‌ తీయకుండా డాట్‌బాల్‌ ఆడిన బ్రాత్‌వైట్‌ నాలుగో బంతికి 2 పరుగులు తీసి 80 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచేందుకు యత్నించి బౌల్ట్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. గెలుపుతీరం దాకా తీసుకొచ్చి ఔటైన బ్రాత్‌వైట్‌ పిచ్‌పైనే కూలబడ్డాడు. కివీస్‌ ఆటగాళ్లు టేలర్, విలియమ్సన్‌ సçహా ప్రత్యర్థులంతా ఓదార్చారు. బరువెక్కిన హృదయంతో బ్రాత్‌వైట్‌ మైదానం వీడాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top