ఈరోజు ధోనికి వెరీ వెరీ స్పెషల్‌

Netizens Remember Dhonis Leadership Debut At World T20 2007 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. టీమిండియా తరఫున విజయవంతమైన కెప్టెన్లలో ధోని ముందు వరుసలో ఉన్నాడనేది కాదనలేదని వాస్తవం. ఐసీసీ నిర్వహించే  అన్ని మేజర్‌ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక, తొలి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. 2007 వరల్డ్‌టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలను ధోని నేతృత్వంలోనే టీమిండియా గెలిచింది. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు ధోని. ఇక కీపింగ్‌లోనూ అసాధారణమైన ప్రతిభను కనబరిచాడు. ఐసీసీ ప్రవేశపెట్టిన డీఆర్‌ఎస్‌ను కూడా ధోని రివ్యూ సిస్టమ్‌గా అభిమానులు కీర్తించారంటే అతను వికెట్ల వెనుక ఎంతటి పాత్ర పోషించాడో అర్థమవుతోంది.

ఇదిలా ఉంచితే, సెప్టెంబర్‌ 14.. ధోనికి వెరీ వెరీ స్పెషల్‌గా చెప్పవచ్చు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌ టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అడుగుపెట్టాడు. 2007లో సఫారీ గడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌కు భారత్‌కు ధోని సారథిగా ఎంపిక అయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ధోని తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతకుముందు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ జరగాల్సి ఉన్నా అది వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో  పాక్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా కెప్టెన్సీ పాత్రలో అడుగుపెట్టాడు. దాయాదితో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో బౌల్‌ అవుట్‌ పద్ధతి ద్వారా భారత్‌ విజయం సాధించి శుభారంభం చేసింది.

వరల్డ్‌ టీ20 టోర్నీలో భాగంగా ధోని భారత్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడం ఒకటైతే, ఆ మెగా టైటిల్‌ను అందుకుని భారత్‌ క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సెప్టెంబర్‌ 14వ తేదీ ధోని కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సందర్బాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘ భారత్‌ క్రికెట్‌  ముఖ చిత్రాన్నే మార్చిన క్రికెటర్‌ ధోని’  అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘నువ్వు కెప్టెన్లకే కెప్టెన్‌’ అంటూ  మరొకరు కొనియాడారు. ‘ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని-12 ఏళ్లు’ మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ భారత్‌ గెలిచినప్పుడు అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడ్ని మీడియా ముందకు పంపే ధోని.. ఓటమి పాలైనప్పుడు మాత్రం అందుకు పూర్తి బాధ్యత వహించడం మాలో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.  ‘ టీ20 వరల్డ్‌కప్‌ గెలిచినప్పట్నుంచే ధోని శకం ప్రారంభమైంది’ మరొకరు కొనియాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top