బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లలో ధోనికి దక్కని చోటు

MS Dhoni Dropped From BCCI New Contract List - Sakshi

27 మందిలో ఐదుగురు కొత్తవాళ్లు

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్‌ వర్తిస్తుంది. టాప్‌ గ్రేడ్‌ అయిన ‘ఎ ప్లస్‌’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది.

రాహుల్‌కు ప్రమోషన్‌... 
టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దాంతో అతడిని ‘బి’ గ్రేడ్‌ నుంచి ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోట్‌ చేశారు. టెస్టు ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్‌ అగర్వాల్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్, ఖలీల్‌ అహ్మద్‌ తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కొత్తగా సైనీ, దీపక్‌ చాహర్, శార్దుల్‌ ఠాకూర్, శ్రేయస్‌ అయ్యర్, వాషింగ్టన్‌ సుందర్‌లకు తొలిసారి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ దక్కింది.  

సమాచారమిచ్చారట..! 
ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత ధోని మైదానంలో కనిపించలేదు. మళ్లీ ఆడతాడా లేదా తెలీదు. తాను ఏ ప్రకటన ద్వారానూ చెప్పడు. సెలక్షన్‌ కమిటీకి సమాచారమే ఉండదు. బోర్డు అధ్యక్షుడు గంగూలీ త్వరలోనే తేలుస్తామంటాడు గానీ స్పష్టతనివ్వడు. ఇలాంటి నేపథ్యంలో కోచ్‌ రవిశాస్త్రి నోటినుంచి వచ్చిన మాటలే బ్రహ్మపలుకులుగా భావించాల్సి వస్తోంది. టెస్టులకు ఎప్పుడో దూరమైన ధోని ఇక వన్డే కెరీర్‌ కూడా ముగిసినట్లేననే అతను పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు కాంట్రాక్ట్‌నుంచి తప్పించడం ద్వారా బీసీసీఐ కూడా తమ నిర్ణయం వెలువరించిందనే అర్థం చేసుకోవచ్చు.

గత అక్టోబరు నుంచి ధోని ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. వచ్చే సెప్టెంబరులోగా ఆడతాడనే నమ్మకం లేదు. ఒక వేళ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి టి20 ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చినా ఆ టోర్నీ అక్టోబరులో ఉంది. కాబట్టి నిబంధనల ప్రకారం చూస్తే ధోనికి కాంట్రాక్ట్‌ అర్హత లేదు. ఈ విషయంపై మాజీ కెప్టెన్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. స్వయంగా గంగూలీయే దీనిని చెప్పినట్లు తెలుస్తోంది. ‘బోర్డు అత్యున్నత అధికారి ఒకరు కాంట్రాక్ట్‌ విషయం గురించి ధోనితో మాట్లాడారు. తనకు అర్హత లేదు కాబట్టి తన పేరు పరిశీలించవద్దని అతనే చెప్పాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ అతను జట్టులోకి వస్తే కాంట్రాక్ట్‌ తిరిగి రావడం పెద్ద విషయం కాదు’ అని బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు.

రంజీ టీమ్‌తో కలిసి... 
రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే ధోని మైదానంలోకి దిగడం విశేషం. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్‌ జట్టు రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్‌ ట్రైనింగ్‌లో కూడా అతను భాగమైనట్లు జార్ఖండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్‌ మెషీన్‌ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్‌ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్‌ కోసం తాను సిద్ధమవుతున్నట్లు మహి పరోక్షంగా చూ పించాడు. ఐపీఎల్‌తోనే పునరాగమనం చేయవచ్చు.

కొత్త కాంట్రాక్ట్‌ జాబితా (గ్రేడ్‌లవారీగా) 
‘ఎ ప్లస్‌’ (రూ. 7 కోట్లు)  కోహ్లి, రోహిత్, బుమ్రా  
‘ఎ’ (రూ. 5 కోట్లు)  అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్, రాహుల్‌ 
‘బి’ (రూ. 3 కోట్లు)  ఉమేశ్, చహల్, పాండ్యా, సాహా, మయాంక్‌ 
‘సి’ (రూ. 1 కోటి)  జాదవ్, మనీశ్‌ పాండే, విహారి,  సైనీ, దీపక్‌ చాహర్, శార్దుల్, అయ్యర్, వాషింగ్టన్‌ సుందర్‌.  

‘బి’ గ్రేడ్‌కు మిథాలీ రాజ్‌
మహిళల జట్టు కాంట్రాక్ట్‌లలో వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ దిగువకు పడిపోయింది. ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆమెను ‘బి’ గ్రేడ్‌లోకి మార్చారు. టి20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ప్రస్తుతం మిథాలీ ఒకే ఫార్మాట్‌లో ఆడుతోంది. ‘ఎ’ గ్రేడ్‌లో టి20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ , ఓపెనర్‌ స్మృతి మంధాన తమ స్థానాలు నిలబెట్టుకోగా, కొత్తగా లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల భారత్‌ విజయాల్లో పూనమ్‌ కీలక పాత్ర పోషించింది. రాధ యాదవ్, తాన్యా భాటియాలకు ‘సి’ గ్రేడ్‌నుంచి ‘బి’లోకి ప్రమోషన్‌ లభించగా, 15  ఏళ్ల షఫాలీ శర్మకు తొలిసారి కాంట్రాక్ట్‌ దక్కింది.  మహిళల జట్టు కాంట్రాక్ట్‌లు కూడా 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్‌ వరకు వర్తిస్తాయి.

కొత్త కాంట్రాక్ట్‌ జాబితా (గ్రేడ్‌లవారీగా)
‘ఎ’ (రూ. 50 లక్షలు)  హర్మన్, స్మృతి, పూనమ్‌ యాదవ్‌ 
‘బి’ (రూ. 30 లక్షలు)  మిథాలీ, ఏక్తా బిష్త్, జులన్, శిఖా పాండే, దీప్తి శర్మ, జెమీమా, తాన్యా, రాధ  
‘సి’ (రూ. 10 లక్షలు)  హేమలత, అనూజ, వేద, మాన్సి, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి, పూజ, హర్లీన్, ప్రియ పూనియా, పూనమ్‌ రౌత్, షఫాలీ వర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top