భారత జట్టుకు జై కొట్టినందుకు..

Man Arrested For Locking Up Team India Football Fans In UAE - Sakshi

పంజరంలో బంధించిన దుబాయ్‌ షేక్‌

యూఏఈలో జరుగుతున్న ఏషియన్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులను ఓ దుబాయ్‌ షేక్‌ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. 

‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్‌ ప్రశ్నించాడు. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ ఫ్యాన్స్‌ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్‌ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్‌ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.

విచారణ నిమిత్తం అటెండ్‌ కావాలని ఆదేశించారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్‌ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్‌ చేశాడు. టీమిండియా అభిమానులు పలు ఆసియా దేశాలకు చెందినవారుగా తెలిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top