మ్యాచ్‌ ఫీజులు చెల్లించండి మహాప్రభు! 

Maharashtra Ranji Players Requesting BCCI About Their Fees - Sakshi

దేశవాళీ క్రికెటర్ల వేడుకోలు

గత సీజన్‌ ముగిసినా చేతికందని డబ్బులు

ముంబై: కరోనా... లాక్‌డౌన్‌... ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆటలు... కొత్త సీజన్‌పై ఆశలేదు. ఐపీఎల్‌ కచ్చితంగా జరుగుతుందన్న విశ్వాసం లేదు. ఆర్థిక కష్టాలు... వెరసి కనీసం గత సీజన్‌ మ్యాచ్‌ ఫీజులైనా చెల్లించండి అంటూ భారత దేశవాళీ క్రికెటర్లు అత్యంత ధనవంతమైన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను వేడుకుంటున్నారు. పైగా బోర్డు స్థూల ఆదాయం (జీఆర్‌ఎస్‌) తాలూకు ఆటగాళ్ల వాటా కూడా నాలుగేళ్లుగా విడుదల చేయడం లేదు. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, బ్రాండింగ్‌ ఎండార్స్‌మెంట్లున్న ఆటగాళ్లకు ఈ ఫీజులతో నష్టం లేకపోయినా... దేశవాళీ ఆటగాళ్లకు బోర్డు చెల్లింపులే జీవనాధారం. కాబట్టి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే బోర్డు కరుణించాలని నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.

హామీ ఇచ్చినా... 
గతేడాది బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టగానే... దేశవాళీ క్రికెటర్ల చెల్లింపులు పెంచడమే తన లక్ష్యమన్నారు. కానీ ఆయన ఏలుబడిలో పెరగడం అటుంచి... లెక్క ప్రకారం రావాల్సినవే ఆటగాళ్లకు అందడం లేదు. గత ఫస్ట్‌క్లాస్, లిస్ట్‌ ‘ఎ’ సీజన్‌ మార్చి నెలతో ముగిసింది. బోర్డు లెక్కల ప్రకారం రంజీ ఆటగాడికి రోజుకు రూ. 35 వేలు, ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 17,500 మ్యాచ్‌ ఫీజుగా చెల్లిస్తారు. అంటే రంజీ ట్రోఫీ అసాంతం (గరిష్టంగా 9 మ్యాచ్‌లు) ఆడిన ప్లేయర్లకు మొత్తం కలిపి రూ. 13 లక్షలు ఇవ్వాలి.

అయితే ముంబై, మహారాష్ట్ర, బెంగాల్, త్రిపుర, హైదరాబాద్‌ సహా ఏ రాష్ట్ర జట్టు ఆటగాళ్లు ఇప్పటివరకు బోర్డు నుంచి నయాపైసా అందుకోలేకపోయారు. దీంతో పాటు బోర్డు ఆర్జనలో కొంత వాటా దేశవాళీ ఆటగాళ్లకు చెల్లిస్తారు. దీన్నే జీఆర్‌ఎస్‌ అంటారు. ఇది నాలుగేళ్లుగా నిలిచిపోయింది. కారణాలేవైనా కానివ్వండి దేశవాళీ ఆటగాళ్ల ఆర్థిక కష్టాలైతే బోర్డుకు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆటగాళ్లు బాహాటంగా మీడియా వద్ద తమ అసంతృప్తిని, కష్టాలను వెళ్లగక్కుతున్నారు. పైగా వచ్చే సీజన్‌పై అనిశ్చితి నెలకొందని, బయట ఎక్కడా ఆడే పరిస్థితి కూడా లేదని అందువల్లే మ్యాచ్‌ ఫీజులపైనే ఆధారపడ్డామని వాటి కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు.

మరి బోర్డు మాటేమిటి... 
మ్యాచ్‌ ఫీజులు విడుదల చేయని మాట వాస్తవమేనని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అంగీకరించారు. కొన్ని సాంకేతిక కారణాలు, పద్దుల పరిశీలన వల్లే ఈ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలైతే లెక్కాపద్దుల్ని, ఇన్వాయిస్‌లను ఇప్పటికీ సరిగ్గా పంపలేదని ఆయన ఆరోపించారు. ఇన్వాయిస్‌ల వివరాలు పూర్తిగా పంపితే చెల్లింపుల ప్రక్రియ వేగంగా చేపడతామన్నారు. స్థూల ఆదాయ వాటా (జీఆర్‌ఎస్‌)పై స్పందిస్తూ... 2017–18 బ్యాలెన్స్‌ షీట్‌ తయారీ చాలా ఆలస్యమైందని అందువల్లే ఆటగాళ్ల వాటా చెల్లించలేకపోయామని, ప్రస్తుత లాక్‌డౌన్‌ సమస్య కూడా ఓ కారణమని ధుమాల్‌ వివరించారు.

మహారాష్ట్ర రంజీ జట్టు (ఫైల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top