తొలి మ్యాచ్‌... తొలి ఓవర్లో హ్యాట్రిక్‌ 

Madhya Pradesh Bowler Ravi Yadav World Record Hat Trick - Sakshi

మధ్యప్రదేశ్‌ బౌలర్‌ రవి యాదవ్‌ అరుదైన ఘనత

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ రవి రమాశంకర్‌ యాదవ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డును నమోదు చేశాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను తన తొలి ఓవర్లోనే ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఇది జరిగింది. రవి యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వరుస బంతుల్లో యూపీ బ్యాట్స్‌మెన్‌ ఆర్యన్‌ జుయాల్, అంకిత్‌ రాజ్‌పుత్, సమీర్‌ రిజ్వీ అవుటయ్యారు. మొదటి రోజు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటవ్వగా... ఆట ముగిసే సమయానికి ఉత్తరప్రదేశ్‌ 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. 

ఈ మూడు వికెట్లు రవి యాదవ్‌ తీశాడు.  ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన రిసీ ఫిలిప్స్‌ 1939–40లో ఇలాగే తాను వేసిన తొలి ఓవర్లో హ్యాట్రిక్‌ సాధించినా... అంతకుముందే అతను నాలుగు మ్యాచ్‌లు ఆడి వాటిలో బౌలింగ్‌ చేయలేదు. భారత్‌ తరఫున ఇంతకు ముందు ఏడుగురు బౌలర్లు (వీబీ రంజనే, జేఎస్‌ రావు, మహబూదుల్లా, సలీల్‌ అంకోలా, జవగల్‌ శ్రీనాథ్, ఎస్పీ ముఖర్జీ, అభిమన్యు మిథున్‌) తమ తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌లు తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top