షేమ్‌.. షేమ్‌.. కోహ్లి!

Kohli Trolled For Twitter Silence On Kumble Birthday

భారత లెజెండరీ బౌలర్‌ అనిల్‌ కుంబ్లేకు పుట్టినరోజు శుభాకాంక్షల విషయంలో భారత క్రికెట్‌ సంఘం (బీసీసీఐ) వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అనిల్‌ కుంబ్లేను కేవలం 'మాజీ బౌలర్‌గా' పేర్కొంటూ బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో శుభాకాంక్షలు తెలుపడం.. ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. భారత క్రికెట్‌ జట్టుకు నిరుపమానమైన సేవలు అందించిన కుంబ్లేను ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. వెంటనే తప్పును గ్రహించిన బీసీసీఐ తన ట్వీట్‌ను తొలగించి.. కుంబ్లేను మాజీ కెప్టెన్‌, లెజెండ్‌ బౌలర్‌ అని ప్రశంసిస్తూ.. మరో ట్వీట్‌ పెట్టింది. అయితే, బీసీసీఐతో నెటిజన్ల ఆగ్రహం ఆగిపోలేదు. కుంబ్లేకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వారి దృష్టి పడింది.

అంతే, కోహ్లిపై తీవ్రంగా విరుచుకుపడుతూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. గత ఏడాది టీమిండియా కోచ్‌గా కుంబ్లే ఉన్నప్పుడు ట్విట్టర్‌ వేదికగా కోహ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఏడాది అదే రోజున సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండి పలు పోస్టులు పెట్టిన కోహ్లి.. కుంబ్లేకు శుభాకాంక్షలు మాత్రం తెలుపలేదు. దీనిని గుర్తించిన నెటిజన్లు కోహ్లిపై మండిపడుతున్నారు. కోహ్లితో విభేదాల కారణంగా కోచ్‌ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే. కుంబ్లే తప్పుకోవడంతో కోహ్లికి సన్నిహితుడైన రవిశాస్త్రి కోచ్‌ పదవిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సరైన రీతిలో గౌరవం ఇవ్వకుండా కుంబ్లేపై ట్వీట్‌ చేయడం.. ఇక కోహ్లి సోషల్‌ మీడియాలో మౌనం పాటించడం నెటిజన్లలో ఆగ్రహం తెప్పించింది. బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ను కలిసి ప్రశంసించేందుకు, ఫుట్‌బాల్‌ ఆట ఆడేందుకు కోహ్లికి టైమ్‌ ఉంది కానీ, కుంబ్లేకు శుభాకాంక్షలు తెలిపేందుకు లేదా.. సిగ్గుచేటు అంటూ ఆగ్రహంగా ట్వీట్లు పెడుతున్నారు. కోహ్లికి ఇంత ఈగో పనికిరాదని, కుంబ్లే పట్ల కనీస మర్యాద చూపాలని హితవు పలుకుతున్నారు.

నెటిజన్ల ఆగ్రహం ఇలా ఉండగా.. టీమిండియా సహచరులు పలువురు మాత్రం కుంబ్లే సేవలను ఘనంగా కొనియాడుతూ.. అతనికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top