కోహ్లి అలా చేసేసరికి కంగారు పడ్డా: శ్రీకర్‌ భరత్‌

Its Amazing When I Recieved Trophy From Kohlis Hands, Bharat - Sakshi

బ్యాట్స్‌మన్‌ నుంచి వికెట్‌ కీపర్‌గా పరిణామం

కోచ్‌లు తర్ఫీదులో రాటుదేలాను.. ద్రావిడ్, ఎమ్మెస్కే బాగా ప్రోత్సహించారు

 కోహ్లి నుంచి ట్రోఫీ అందుకున్న క్షణాలు చిరస్మరణీయం

 భారత యువ క్రికెటర్‌ శ్రీకర్‌ భరత్‌

‘తపన.. పట్టుదల.. క్రమశిక్షణ.. శ్రమ.. అన్నింటినీ మించి ఇష్టమైన రంగంపై ఎనలేని మక్కువ.. ఇవే దేశం తరఫున క్రికెట్‌ ఆడేందుకు అవకాశం కల్పించాయి. ఈ ప్రయాణంలో కుటుంబం వెన్నుదన్నుగా నిలిచింది. గురువులు సరైన దిశా నిర్దేశం చేశారు. నా ఆట మీద పూర్తి విశ్వాసంతో ఉన్నా.. బాగా రాణించి భారత జట్టులో నా స్థానాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా కష్టపడతాను’ అని అన్నారు క్రికెట్‌ యువ కెరటం, విశాఖ ఆణిముత్యం కోన శ్రీకర్‌ భరత్‌. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పాల్గొని.. నగరానికి తొలిసారిగా విచ్చేసిన ఆయనకు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. నగరంలో మధురవాడ బక్కన్నపాలెం సమీపంలో తన నివాసానికి వచ్చిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.

సాక్షి: భారత జట్టులో స్థానం లభించడంపై ఎలా ఫీల్‌ అవుతున్నారు? 
భరత్‌: లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ ఆనందమే వేరు. ఇప్పటితో అయిపోలేదు. ఇది నాకు ప్రారంభం మాత్రమే.. సాధించాల్సింది చాలా ఉంది.  

సాక్షి: ఈ రంగంలోకి ఎలా వచ్చారు? 
భరత్‌: నేను చిన్నతనంలో చాలా చలాకీగా ఉండేవాడినట. చుట్టు పక్కల పిల్లలతో ఆడుతున్నప్పుడు నా ఆసక్తిని నాన్న గమనించారు. కోచ్‌ కష్ణారావు దగ్గర శిక్షణలో చేర్పించారు. రోజూ శిక్షణకు తీసుకెళ్లేవారు. అలా ఎనిమిదేళ్లలోనే నా క్రికెట్‌ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత వీడీసీఏ కోచ్‌లు బాగా తర్ఫీదు ఇచ్చి ప్రోత్సహించారు.  

సాక్షి: ఈ స్థాయికి ఎలా ఎదిగారు? 
భరత్‌: నా తల్లి దండ్రులు, అక్క. నేను ఈ స్థాయికి ప్రోత్సాహించిన అందరినీ నేను కుటుంబంగానే భావిస్తాను. మొదట నాకు శిక్షణ ఇచ్చిన కోచ్‌.. ఇప్పుడు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌ కోచ్‌ జయకష్ణారావు, భారత్‌–ఎ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్, భారత్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌.. ఇలా చాలా మంది నన్ను ప్రోత్సహించారు. నేను రంజీలో ఆడుతున్నప్పుడే భారత్‌ జట్టుకు కచ్చితంగా ఆడతావని.. బాగా సాధన చేయమని ద్రావిడ్‌ చేప్పేవారు.  

సాక్షి: కోచ్‌  మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారు?
భరత్‌: నేను మొదట బ్యాట్స్‌మన్‌ మాత్రమే. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని ఒడిసి పట్టే విధానం, స్పందించే తీరు చూసిన కోచ్‌ నన్ను వికెట్‌ కీపర్‌గా మార్చారు. మొదట్లో కొన్ని ఓవర్లు కీపింగ్‌ చేసిన నేను.. తర్వాత పూర్తిస్థాయి కీపర్‌గా స్థిరపడ్డాను. ఆటలో క్రమశిక్షణ, ఒత్తిడిని తట్టుకోవడం, నైతిక విలువలు, జట్టు, ఆటగాళ్లతో ఎలా నడుచుకోవాలి.. అనే అంశాలపై కోచ్‌ పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయిని శిల్పంలా తయారు చేసింది కోచ్‌ జయకష్ణారావు.

సాక్షి: ఇతరుల ప్రోత్సాహం ఎలా ఉంది?
భరత్‌: నాకు స్నేహితులు చాలా తక్కువ. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతాను. నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించింది నా కుటుంబ సభ్యులే. నా కుటుంబమే నా బలం. ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కోచ్, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని విషయాలను నా బెస్ట్‌ ఫ్రెండ్‌ విమల్‌తో చెబుతాను. తను చాలా ఎంకరేజ్‌ చేస్తాడు. ఎలాగైనా టీం ఇండియాలో ఆడాలని ప్రోత్సహించేవాడు. అపజయాలు ఎదురైనప్పుడు తోడుగా నిలిచేవాడు. మాకు రాని అవకాశం నీకు వచ్చిందంటూ నిత్యం ప్రేరణ కలిగించేవాడు.  

సాక్షి: మీ విజయ రహస్యం? 
భరత్‌: క్రికెట్‌లో విజయాలతో పాటు అపజయాలు ఉంటాయి. ఎప్పడూ ఒకేలా ఆడలేం. అలాంటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుని ముందుకు వెళ్లడమే విజయ రహస్యం. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించేందుకు కషి చేస్తాను. కష్ట పడకుండా ఫలితం ఆశించకూడదు. ఒకవేళ అలాంటి ఫలితం వచ్చినా ఎక్కువ కాలం నిలవదు. నా ఆట మీద నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాను. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఇదే నా ముందున్న లక్ష్యం.

సాక్షి: కోహ్లీ ట్రోఫీ అందివ్వగానే మీ ఫీలింగ్‌ ఏంటి?
భరత్‌: బంగ్లాదేశ్‌తో సిరీస్‌ గెలిచిన తర్వాత ట్రోఫీని కోహ్లి నేరుగా నా చేతుల్లో పెట్టారు. అప్పుడు ఎలా స్పందించాలో తెలియక కంగారు పడ్డాను. అప్పుడు కోహ్లి ఈ జట్టులోకి నిన్ను సాదరంగా ఆహా్వనిస్తున్నామని, దానికిది చిన్న సంకేతం లాంటిదని చెప్పారు. ఈ క్షణాలను ఆస్వాదించాలన్నారు. రోహిత్‌ శర్మ కూడా నా భుజం తట్టి ప్రొత్సహించారు. ఇది నీ రోజు, ఫుల్లుగా ఎంజాయ్‌ చేయ్‌’ అని చెప్పారు. ఆ క్షణాలు నాలో చాలా ఆనందం కలిగించాయి.

ఇదీ కుటుంబ నేపథ్యం
1993 మార్చి 10వ తేదీన జన్మించిన భరత్‌ పాఠశాల విద్యను సెయింట్‌ అల్యోసిస్, ఇంటర్‌ వికాస్‌ కళాశాల, బి.కాం. బుల్లయ్య కళాశాలలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన భరత్‌ తండ్రి శ్రీనివాసరావు విశాఖ నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం, ఇతర కారణాల వలన విశాఖలో స్థిరపడ్డారు. తల్లి మంగదేవి గహిణి. ఆయన సోదరి మనోజ్ఞ. 2002లోనే భరత్‌ క్రికెట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2012లో ఆంధ్ర రంజీ జట్టు మ్యాచ్‌లు ఆడారు. 2014–15 సీజన్‌ రంజీ ట్రోఫీలో గోవాపై 308 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా చరిత్ర సష్టించారు. మొదట్లో భరత్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రమే. కోచ్‌ సూచనలతో వికెట్‌ కీపర్‌గా మారారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top